Israel-Hamas: గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి
హమాస్, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసిలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఈ తరుణంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగుతోంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 100 మందికి పైగా అమాయకుల్ని బలి తీసుకుందుని గాజా పౌర రక్షణ సంస్థ ఆరోపించింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత దారుణమైన నరమేధమని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటివరకూ 40వేల మందికి పైగా మృతి
అయితే ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. తాము కేవలం హమాస్ కమాండ్ కేంద్రంపైనే దాడి చేశామని స్పష్టం చేసింది. గతవారం గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ పాఠశాలపై జరిపిన దాడుల్లో 30మందికి పైగా మరణించారు. ఇక ఆగస్టు 1న దలాల్ అల్-ముష్రూబి స్కూల్ పై జరిపిన దాడుల్లో కూడా 15 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 40వేల మందికి పైగా పాలస్తీనియర్లు మరణించినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది.