Israel: నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాల నిరసన!
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది జెరూసలెంలోని పార్లమెంట్ ముందు ఆదివారం గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గాజాలో హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న డజన్ల కొద్దీ బందీలను విడిపించేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెలీలు మరణించగా 250 మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనతో ఇజ్రాయెలీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ, ఇప్పటికీ ఇంకా చాలా మంది హమాస్ చెరలో బందీలుగానే ఉన్నారు.
మధ్యవర్తుల ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వమే అడ్డుపడుతోంది
ఈ క్రమంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు నెతన్యాహుకి మద్దతు ఇస్తుంటే .. మరికొందరు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నవంబర్‌లో వారం రోజుల కాల్పుల విరమణ సమయంలో గాజాలో దాదాపు సగం మంది బందీలను విడుదల చేశారు. అయితే మిగిలిన బందీలను స్వదేశానికి తీసుకురావడానికి అంతర్జాతీయ మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ముందడుగు పడే సూచనలు కనిపించకపోవడంతో ఆదివారం మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. దీంతో, బందీల కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెయ్యడమే కాకుండా.. నెతన్యాహు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు తమవారు బయటకు రారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వమే అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు.