LOADING...
Italy: ఇటలీలో సందర్శకుల శునకాలపై సుంకం
ఇటలీలో సందర్శకుల శునకాలపై సుంకం

Italy: ఇటలీలో సందర్శకుల శునకాలపై సుంకం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలు,స్వచ్ఛత దెబ్బతినకుండా కాపాడుకోవడానికై కొన్ని దేశాలు సందర్శకులపై అదనపు పన్నులు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో,ఉత్తర ఇటలీలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం బొల్జానో ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ నగరానికి వచ్చే పర్యాటకులు తమతో పాటు తెచ్చుకునే శునకాలపై కూడా ప్రత్యేక సుంకం విధించాలని నిర్ణయించింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి నుండి అమల్లోకి రానుంది.కొత్త నిబంధన ప్రకారం,ఒక శునకాన్ని వెంట తెచ్చుకునే యజమాని రోజుకు సుమారు రూ.156 (1.50 యూరో) చెల్లించాలి. డోలమైట్ పర్వతాల సందర్శనకు బొల్జానో ద్వారంలా పనిచేస్తుండటంతో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కేవలం పర్యాటకులే కాకుండా, స్థానికులు కూడా తమ ఇళ్లలో పెంపుడు శునకాలను ఎక్కువగా పెంచుతున్నారు.

వివరాలు 

ప్రతి శునకానికి డీఎన్‌ఏ నమోదు తప్పనిసరి

దాని కారణంగా వారు ఏటా సుమారు రూ.10,400 (100 యూరో) పన్ను చెల్లించాల్సి వస్తోంది. నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు, ముఖ్యంగా శునకాల మలమూత్రాలను తొలగించే బాధ్యతను పటిష్టం చేయడానికే ఈ పన్నులు విధిస్తున్నట్లు స్థానిక పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రతి శునకానికి డీఎన్‌ఏ నమోదు తప్పనిసరి చేస్తూ, దానికోసం కూడా అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. యజమానులు తమ శునకాలు వీధుల్లో మలాన్ని వదిలినా శుభ్రం చేయకపోతే, డీఎన్‌ఏ ఆధారంగా ఆ శునకాన్ని గుర్తించి, వారికి సుమారు రూ.62,500 (600 యూరో)ల జరిమానా విధించనున్నారు.

వివరాలు 

ఇలాంటి చర్యలు అవసరమే..

ఇకపోతే, ఇప్పటికే శునకాల డీఎన్‌ఏ నమోదు చేసిన యజమానులకు వచ్చే రెండేళ్ల పాటు పన్నులో రాయితీ లభిస్తుందని, ఈ విధానానికి ప్రధాన కర్త అయిన ప్రొవిన్షియల్ కౌన్సిలర్ లూయీ వాల్చర్ తెలిపారు. అయితే, పెంపుడు జంతువులపై ఈ రకమైన పన్నులు విధించడం సరైందా అనే అంశంపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం, నగరంలోని చారిత్రక ప్రాధాన్యతను కాపాడుకోవడానికీ, పర్యాటకులకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించడానికీ ఇలాంటి చర్యలు అవసరమేనని వాదిస్తున్నారు.