LOADING...
Meloni: 'నేనూ,ఇటలీ ఎవరినీ ప్రాధేయపడము'.. ట్రంప్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్
'నేనూ,ఇటలీ ఎవరినీ ప్రాధేయపడము'.. ట్రంప్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్

Meloni: 'నేనూ,ఇటలీ ఎవరినీ ప్రాధేయపడము'.. ట్రంప్‌కు మెలోనీ స్ట్రాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. మెలోనీ తనతో ఫొటో దిగేందుకు ప్రత్యేకంగా కోరడంతో తాను అంగీకరించినట్లు ట్రంప్ ఇటలీ మీడియా సంస్థ 'లా7'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశాధ్యక్షుడితో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు మెలోనీకి మద్దతుగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు అనుచితంగా, అసభ్యకరంగా ఉన్నాయని ఇటలీ మంత్రులు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందించిన మెలోనీ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు.

వివరాలు 

అమెరికా-ఇటలీ మధ్య దౌత్యపరమైన చర్చ

దీనిపై వీడియో సందేశం విడుదల చేసిన ఆమె, మిత్రదేశ ప్రధాని గురించి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ''పాశ్చాత్య దేశాల శత్రువుల విషయంలో, అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న నాయకుల విషయంలో ట్రంప్ ఇలాంటి భాష ఉపయోగించరు. వారి పట్ల మాత్రం రాజీ ధోరణి ప్రదర్శిస్తుంటారు. కానీ మిత్రదేశాల నాయకుల గురించి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఒక విషయం ట్రంప్ గుర్తుంచుకోవాలి.. నేనూ, ఇటలీ ఎప్పుడూ ఎవరినీ ప్రాధేయపడవు. ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు'' అంటూ మెలోనీ ఘాటుగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా-ఇటలీ మధ్య దౌత్యపరమైన చర్చ మొదలవగా, ఈ అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement