టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆ సమయంలోనే పేలి ఉంటుంది: 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కామెరూన్
టైటాన్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదంపై 'టైటానిక్' డైరెక్టర్, డీప్ సీ ఎక్స్‌ప్లోరర్ జేమ్స్ కామెరూన్ స్పందించారు. టైటాన్ మినీ జలాంతర్గామి దాని ఉపరితల సహాయక నౌకతో సంబంధాన్ని కోల్పోయిన వెంటనే అది పేలిపోయి ఉంటుందని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. తన సోర్స్ ద్వారా అందిన సమాచారం మేరకు తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. పరిశోధన, పర్యాటకం కోసం సబ్‌మెర్సిబుల్స్‌ను తయారు చేసే ట్రిటాన్ సబ్‌మెరైన్స్ సంస్థ సహ యజమానిగా కూడా జేమ్స్ కామెరూన్ ఉన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో సబ్‌మెర్సిబుల్ తప్పిపోయిన గంట తర్వాత తెలిసిందని చెప్పారు. టైటాన్ సబ్‌మెర్సిబుల్ తప్పిపోయిన సమయంలోనే పెద్ద చప్పుడు వచ్చిందని, హైడ్రోఫోన్‌లో అది వినిపించినట్లు జేమ్స్ చెప్పారు. ఆ క్షణంలోనే టైటాన్ పేలిపోయిందని నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.
రెండు ప్రమాదాలు ఒకేచోట జరగడం ఆశ్చర్యకరం: జేమ్స్ కామెరూన్
టైటానిక్ శిథిలాలు ఉన్న చోటును జేమ్స్ కామెరూన్ ఇప్పటి వరకు 30సార్లు సందర్శించారు. సముద్ర గర్భంలో సహసయాత్ర చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని కామెరాన్ పేర్కొన్నారు. అయితే టైటాన్, టైటానిక్ ప్రమాదాలు రెండు కూడా ఒకే చోట జరగడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఓషన్ గేట్ సంస్థ మిశ్రమ కార్బన్ ఫైబర్, టైటానియం హల్‌తో సబ్‌మెర్సిబుల్‌ను నిర్మించడంపై తనకు అనుమానాలు ఉన్నాయని కామెరాన్ చెప్పారు. మినీ సబ్‌మెర్సిబుల్ సముద్రం లోతుగా వెళ్లాలి కాబట్టి, ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనా, అధునాతనంగా నిర్మించాలని సూచించారు. 1912 నాటి టైటానిక్ విపత్తు, ప్రస్తుత టైటాన్ పేలుడు దగ్గరి పోలికలతో ఉన్నాయని చెప్పారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ నౌకలను నడిపేవారు ప్రయాణికుల జీవితాలకు ప్రమాదం కలిగించే హెచ్చరిక సంకేతాలను విస్మరించారన్నారు.