Japan: జపాన్ సంచలన నిర్ణయం… 80 ఏళ్ల ఆయుధ నిషేధానికి ముగింపు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 ఏళ్లుగా కొనసాగుతున్న రాజ్యాంగ పరిమితులకు ముగింపు పలుకుతూ, ఇతర దేశాలకు యుద్ధ విమానాలు సహా వివిధ రకాల ఆయుధాలను విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు,ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వచ్చిన మార్పులు జపాన్ తన రక్షణ విధానాన్ని పునఃపరిశీలించుకునేలా చేశాయి. అయితే ఆయుధాల విక్రయంలో జపాన్ కఠిన నియమాలు విధించింది. ఐక్యరాజ్య సమితి నిబంధనలకు కట్టుబడి ఉండే దేశాలకు మాత్రమే ఆయుధాలను విక్రయిస్తామని ప్రధాన మంత్రి సనాయే తకైచీ స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం అయినా తన రక్షణను ఒంటరిగా నిర్వహించలేదని,పరస్పర సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ రూపొందించుకున్న కొత్త రాజ్యాంగం ప్రకారం ఆయుధాల ఎగుమతిపై కఠిన నిషేధం అమల్లో ఉంది. అయితే మారుతున్న అంతర్జాతీయ భద్రతా సమీకరణాల నేపథ్యంలో ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆయుధ విపణిలో తాము ఏ ఏ వస్తువులను విక్రయించనున్నామన్న దానిపై అధికారిక జాబితాను ఇంకా ప్రకటించకపోయినా, యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆధునిక యుద్ధ నౌకలను విదేశాలకు సరఫరా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు
ప్రస్తుతానికి సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అర్హత పొందినట్లు అక్కడి మాధ్యమాలు వెల్లడించాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న పాత నియమాల ప్రకారం జపాన్ కేవలం నిఘా పరికరాలు, సముద్రంలో పేలుడు పదార్థాలను తొలగించే పరికరాలు వంటి ప్రాణాంతకం కాని సామగ్రినే ఎగుమతి చేసేది. కానీ ఇప్పుడు యుద్ధ విమానాల విక్రయానికి కూడా ముందుకు రావడం ద్వారా అమెరికా, రష్యా, చైనా వంటి ప్రముఖ ఆయుధ దేశాలకు జపాన్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.