LOADING...
Japan: ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం

Japan: ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం పునఃప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రంగా పేరొందిన కాషివాజాకి-కరీవా అణు విద్యుత్‌ కేంద్రంను జపాన్ సోమవారం మళ్లీ కార్యకలాపాల్లోకి తీసుకొచ్చింది. గతంలో సాంకేతిక లోపాల కారణంగా నిలిచిపోయిన ఈ కేంద్రం ఇప్పుడు తిరిగి విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధమైంది. 2011లో సంభవించిన భారీ భూకంపం,సునామీ నేపథ్యంలో ఫుకుషిమా అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరగడంతో, దేశవ్యాప్తంగా ఉన్న అణు విద్యుత్‌ కేంద్రాలను అప్పట్లో జపాన్‌ ప్రభుత్వం మూసివేసింది. ఆ తరువాత పరిస్థితుల్లో శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.

వివరాలు 

అణుశక్తి వైపు అడుగులు

2050 నాటికి 'కార్బన్‌ న్యూట్రాలిటీ' లక్ష్యాన్ని సాధించడంతో పాటు, కృత్రిమ మేధ (ఏఐ) అవసరాల వల్ల పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు మళ్లీ అణుశక్తి వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను పునఃప్రారంభించేందుకు జనవరిలో తొలి ప్రయత్నం జరిగింది. అయితే మానిటరింగ్‌ అలారం మోగడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా ఈ కేంద్రంలోని ఒక రియాక్టర్‌ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనట్లు టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టీఈపీసీఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే నెలలో సమగ్ర తనిఖీలు పూర్తయ్యాక ఈ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ అణు విద్యుత్‌ కేంద్రంలో మొత్తం ఏడు రియాక్టర్లు ఉన్నాయి.

Advertisement