 
                                                                                JD Vance: నా భార్య ఏదో ఒక రోజు క్రైస్తవ మతంలోకి మారుతుంది: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ మత మార్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువైన తన భార్య భవిష్యత్తులో క్రైస్తవ మతాన్ని స్వీకరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె మతం మారకపోయిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన బుధవారం మిసిసిపిలో జరిగిన "టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ" కార్యక్రమం సందర్భంగా చేశారు.
వివరాలు
ప్రతి ఆదివారం ఉష తనతో పాటు చర్చికి వస్తోందని వెల్లడి
జేడీ వాన్స్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఉషా ప్రతి ఆదివారం నాతో కలిసి చర్చికి వస్తోంది. నేను చర్చ్ ద్వారా ఎలా ప్రభావితమయ్యానో, ఆమె కూడా అలాగే ప్రభావితమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని నా అత్యంత సన్నిహితులైన లక్షలాది స్నేహితుల సమక్షంలో చెబుతున్నాను. ఇది జరిగితే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే క్రైస్తవ సువార్తపై నాకు గాఢమైన విశ్వాసం ఉంది. నా భార్య కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని నేను నమ్ముతున్నాను," అని ఆయన తెలిపారు.
వివరాలు
చివరికి ఆమె క్రీస్తు వైపు రావాల్సిందే కదా!
కార్యక్రమం సందర్భంగా ప్రేక్షకుల్లో ఒకరు "మీ భార్య ఉషా క్రైస్తవ మతంలోకి మారుతారా?" అని అడగగా, వాన్స్ చిరునవ్వుతో .. "చివరికి ఆమె క్రీస్తు వైపు రావాల్సిందే కదా!" అని సమాధానమిచ్చారు. జేడీ వాన్స్ క్రైస్తవ విశ్వాసాలకు కట్టుబడి ఉన్నారు, ఇక ఆయన భార్య ఉషా భారతీయ మూలాలున్న హిందూ కుటుంబానికి చెందినవారు.