Israel-Hamas war: 'మళ్లీ గాజాను ఆక్రమిస్తే అతిపెద్ద తప్పు అవుతుంది'.. ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్
ఇజ్రాయెల్ దళాలు గాజాపై డాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా గట్టిగా హెచ్చరించింది. గాజాను ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించాలని చూస్తే, అది అతిపెద్ద తప్పు అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ మేరకు బైడెన్ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హమాస్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అలాగే గాజా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణం వైపు వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించింది.
ఇజ్రాయెల్‌లో 1,400, గాజాలో 2,670 మంది మృతి
ఈ క్రమంలో గాజాను ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించడానికి మద్దతు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు బైడెన్ పై విధంగా సమాధానం చెప్పారు. ఒకవేళ, ఇజ్రాయెల్ ఆక్రమిస్తే.. అది అతిపెద్ద తప్పు అవుతుందని తాను భావిస్తున్నట్లు బైడెన్ వివరించారు. అలాగే, హమాస్ అనేది మిలిటెంట్ సంస్థ అని, అది పాలస్తీనా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించదని బైడెన్ పేర్కొన్నారు. ఈ సమయంలో ఆక్రమణ కాకుండా, ఉగ్రవాదులను గుర్తించి, వారిని హతమార్చడం ముఖ్యం అన్నారు. హమాస్ దాడిలో 1,400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో 2,670 మంది మరణించారు.