LOADING...
Kash Patel: మరో వివాదంలో కాశ్‌పటేల్‌.. కొంపముంచిన ప్రేయసితో లగ్జరీ డేట్
మరో వివాదంలో కాశ్‌పటేల్‌.. కొంపముంచిన ప్రేయసితో లగ్జరీ డేట్

Kash Patel: మరో వివాదంలో కాశ్‌పటేల్‌.. కొంపముంచిన ప్రేయసితో లగ్జరీ డేట్

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా ఉన్న భారతీయ మూలాల నేత కాశ్‌ పటేల్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆయనపై, ఇప్పుడు ప్రేయసితో చేసిన లగ్జరీ డేట్‌ నైట్‌కు సంబంధించిన ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రయాణానికి కూడా ప్రభుత్వ వనరులనే ఉపయోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు

ప్రైవేట్ సూట్ అద్దెకు తీసుకుని ఆ పనులా?

సమాచారం ప్రకారం, గత ఏడాది మే 10న కాశ్‌ పటేల్‌ తన ప్రేయసి అలెక్సీస్‌ విల్‌కిన్స్‌తో కలిసి ఎఫ్‌బీఐకు చెందిన ప్రత్యేక జెట్‌ విమానంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన ఒక సంగీత కచేరీకి హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల డాలర్ల విలువైన ప్రైవేట్‌ సూట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.47 లక్షలకు పైగానే ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిసే వరకు విమాన సిబ్బంది, భద్రతా సిబ్బంది రాత్రి 11 గంటల వరకూ అక్కడే విధుల్లో కొనసాగాల్సి వచ్చిందని, అందుకోసం వారికి అదనపు వేతనాలు కూడా చెల్లించబడినట్లు సమాచారం.

వివరాలు

ఆ వ్యవహారంపై అధిక ఆరోపణలు..

ఈ వ్యవహారం ప్రస్తుతం అమెరికా రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ విలాసవంతమైన సూట్‌కు ఖర్చు ఎవరు భరించారన్న ప్రశ్నకు కాశ్‌ పటేల్‌ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇక మరోవైపు, ఇటీవల పెర్ల్‌ హార్బర్‌లోని యూఎస్‌ఎస్‌ ఆరిజోనా స్మారక స్థూపం సమీపంలో రహస్యంగా వీఐపీ స్నార్కెలింగ్‌ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే, ఆ కార్యక్రమం అధికారిక పర్యటనలో భాగమేనని ఎఫ్‌బీఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తన ప్రేయసి పాల్గొన్న కాన్సర్ట్‌కు వెళ్లేందుకు సుమారు 60 మిలియన్‌ డాలర్ల విలువైన ప్రభుత్వ విమానాన్ని వినియోగించడమే కాకుండా, అలెక్సీస్‌ విల్‌కిన్స్‌కు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కల్పించారనే ఆరోపణలు కూడా కాశ్‌ పటేల్‌పై వినిపిస్తున్నాయి.

Advertisement