Keir Starmer: బ్రిటన్‌లో లేబర్ పార్టీలో కల్లోలం.. కీర్ స్టార్మర్‌పై పెరుగుతున్న రాజీనామా ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలికిన లేబర్ పార్టీ.. ఏడాది పూర్తికాకముందే తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన భారీ ఎదురుదెబ్బలతో ప్రధాని కీర్ స్టార్మర్ నాయకత్వంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలంటూ 70 మందికిపైగా ఎంపీలు, పలువురు సీనియర్ మంత్రులు ఒత్తిడి తీసుకురావడం బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వివరాలు
'ప్లాయిడ్ సిమ్రూ'ఆధిపత్యం
తాజా కౌన్సిల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ముఖ్యంగా 1999నుంచి తమ ఆధీనంలో ఉన్న వేల్స్ పార్లమెంట్‌ను కోల్పోవడం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. అక్కడ 'ప్లాయిడ్ సిమ్రూ'ఆధిపత్యం చాటుకోవడం లేబర్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. మరోవైపు స్కాట్లాండ్‌లో కూడా పార్టీ ప్రభావం తగ్గిపోగా.. రిఫార్మ్ యూకే, గ్రీన్ పార్టీలు బలపడటం స్టార్మర్ నాయకత్వంపై మరింత అనుమానాలకు దారితీసింది. పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పలువురు కీలక నేతలు ఇప్పటికే స్టార్మర్‌తో భేటీ అయినట్లు సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి యెవెట్టే కూపర్,అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమూద్ వంటి నేతలు పార్టీ ప్రయోజనాల కోసం నాయకత్వ మార్పు అవసరమని సూచించినట్లు బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వివరాలు
నాయకత్వ మార్పు ప్రక్రియ ప్రారంభం కావాలంటే 81 మంది ఎంపీల మద్దతు అవసరం
ఇదిలా ఉండగా నలుగురు కీలక మంత్రుల పార్లమెంటరీ సహాయకులు జో మోరిస్, టామ్ రట్లాండ్, మెలానియా వార్డ్, నౌషాబా ఖాన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రజల్లో స్టార్మర్‌పై విశ్వాసం తగ్గిపోయిందని వారు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వెస్ స్ట్రీటింగ్‌కు సహాయకుడిగా ఉన్న జో మోరిస్.. "ప్రధానిపై ప్రజల నమ్మకం దెబ్బతిన్నది. పరిస్థితిని మార్చే సామర్థ్యం ఆయనలో కనిపించడం లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం అధికారికంగా నాయకత్వ మార్పు ప్రక్రియ ప్రారంభం కావాలంటే కనీసం 81 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇప్పటికే 70 మందికిపైగా సభ్యులు స్టార్మర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
వివరాలు
బాధ్యతల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
ఇంకొంతమంది ఎంపీలు అసమ్మతి వర్గానికి మద్దతిస్తే స్టార్మర్ పదవికి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్ నాయకత్వంలో పార్టీ విజయావకాశాలు చాలా తగ్గిపోయాయని అసంతృప్తి నేతలు భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఒత్తిడిని కీర్ స్టార్మర్ మాత్రం పట్టించుకోవడం లేదు. తనపై అనుమానాలు ఉన్న విషయం తెలుసునని, వాటికి పనితోనే సమాధానం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధి, ఇంధన రంగ సంస్కరణలు, ఐరోపా దేశాలతో మెరుగైన సంబంధాల బలోపేతంపైనే తన దృష్టి కేంద్రీకృతమైందని ఆయన మద్దతుదారులకు భరోసా ఇచ్చారు.
వివరాలు
బ్రిటన్ రాజకీయాల్లో కీలక అంశంగా స్టార్మర్ రాజకీయ సంక్షోభం
ఒకవేళ స్టార్మర్ పదవి వీడాల్సిన పరిస్థితి వస్తే.. ఆయన స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ లేదా మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక మందగమనం మధ్య స్టార్మర్ ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది.