Keir Starmer: ఎప్‌స్టీన్ వ్యవహారంతో బ్రిటన్‌లో రాజకీయ కల్లోలం.. స్టార్మర్ పదవికే ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయ అస్థిరతకు ప్రతీకగా మారిన బ్రిటన్‌లో మరోసారి తీవ్ర సంక్షోభ వాతావరణం నెలకొంది. లైంగిక నేరాల నిందితుడు ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్న పార్టీ సీనియర్ నేత మాండెల్సన్‌ను అమెరికాలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్ స్టార్మర్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం ఆయన పదవికే ముప్పుగా మారడంతో, పార్టీ ఎంపీల మద్దతు కోసం ఆయన ఆశ్రయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కూడా పూర్తికాకముందే ఈ సంక్షోభం తలెత్తడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారం బయటపడిన వెంటనే మాండెల్సన్‌ను పదవి నుంచి తొలగించినా, స్టార్మర్‌పై విమర్శల వెల్లువ తగ్గలేదు. ఆదివారం ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్ స్వీనీ రాజీనామా చేశారు.
వివరాలు
స్టార్మర్ బహిరంగ క్షమాపణలు
ఈ నిర్ణయానికి తానే బాధ్యత వహిస్తానని స్టార్మర్ అంగీకరించినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు. లేబర్ పార్టీ ఎంపీల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు క్రమంగా క్షీణిస్తుండటంతో, స్టార్మర్ రహస్య సమావేశాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మాండెల్సన్ నియామకంపై గత వారం స్టార్మర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మాండెల్సన్ చెప్పిన మాటలను నమ్మడం తన పొరపాటేనని పేర్కొన్నారు. ఈ నియామకానికి సంబంధించిన అన్ని పత్రాలను ప్రజల ముందుకు తెస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల విషయంలో మాండెల్సన్ అసత్యాలు చెప్పారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
పోలీసుల దర్యాప్తు
సుమారు 15సంవత్సరాల క్రితం సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు అందించారనే ఆరోపణలపై మాండెల్సన్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈఆరోపణలు నిరూపితమైతే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఆయనపై లైంగిక దాడుల ఆరోపణలు నమోదు కాలేదు.అందుకే అరెస్టు గానీ, అభియోగాలు గానీ నమోదు చేయలేదు. ప్రకంపనలతో స్వీనీ రాజీనామా 2020లో లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్టార్మర్ చేపట్టిన నాటి నుంచి మోర్గాన్ మెక్ స్వీనీ ఆయనకు అత్యంత సన్నిహిత సహచరుడిగా కొనసాగారు. 2024 జూలైలో జరిగిన సార్వత్రికఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంలో స్వీనీ కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం తీసుకున్న పలు తప్పునిర్ణయాల కారణంగా పార్టీ ప్రతిష్ఠకు మచ్చ పడిందన్న విమర్శలు వచ్చాయి.
వివరాలు
ప్రధానికి కొంత సమయం!
మెక్ స్వీనీ రాజీనామాతో స్టార్మర్‌కు కొంత సమయం దొరకవచ్చని లేబర్ పార్టీ నేతలలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో పార్టీ నేతల్లో విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మెక్ స్వీనీ విభజన రాజకీయాలకు పాల్పడ్డారని,ఆయన వైదొలగడం ద్వారా పార్టీని మళ్లీ సరైన దారిలో నడిపించే అవకాశం వచ్చిందని సీనియర్ చట్టసభ సభ్యురాలు ఎమిలీ థార్న్‌బెర్రీ వ్యాఖ్యానించారు. స్టార్మర్ సామర్థ్యం ఉన్న నేత అని, స్పష్టతతో కూడిన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆమె అన్నారు. అయితే మరో వర్గం నేతలు మాత్రం స్వీనీ రాజీనామాతో స్టార్మర్ మరింత బలహీనపడతారని అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
పాలనలో తడబాటు
కన్జర్వేటివ్ పార్టీ నేత కెమీ బడెనోక్ మాట్లాడుతూ, స్టార్మర్ వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆయన పదవికి ప్రస్తుతం తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. అలాగే స్కాట్‌లాండ్ లేబర్ పార్టీ నేత అనాస్ సర్వర్ స్టార్మర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 14 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతానని అధికారంలోకి వచ్చిన స్టార్మర్.. ఇప్పటివరకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక వృద్ధి, ప్రజాసేవల మెరుగుదల, జీవన వ్యయం తగ్గింపు వంటి అంశాల్లో ఆయన తడబడుతున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. తరచూ తీసుకునే తప్పు నిర్ణయాలు, వాటిపై యూటర్న్‌లు తీసుకోవడం వల్ల ఆయన పాలన అపహాస్యం పాలవుతోంది.
వివరాలు
మళ్లీ ఎన్నికలు అవసరం లేదు
బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం, ఒక ప్రధాని రాజీనామా చేసినా లేదా పార్టీలో విభేదాలు తలెత్తినా వెంటనే కొత్త ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న పార్టీకి చెందిన ఎంపీలు కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. గతంలో 2019 ఎన్నికల్లో గెలిచిన కన్జర్వేటివ్ పార్టీ తరఫున ముగ్గురు ప్రధానులు బాధ్యతలు నిర్వహించారు. అందులో కేవలం 49 రోజులు పదవిలో ఉన్న లిజ్ ట్రస్‌తో పాటు భారత సంతతికి చెందిన రిషి సునాక్ కూడా ఉన్నారు.
వివరాలు
వారసత్వ పోటీ
స్టార్మర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ఇప్పటినుంచే ప్రారంభమైంది. ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్, మాజీ ఉప ప్రధాని ఏంజెలా రేనర్, మాజీ మంత్రి యాండీ బర్న్‌హామ్, హోం మంత్రి షబానా మహమూద్, ఇంధన శాఖ మంత్రి ఎడ్ మిల్లిబాండ్ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. యువరాజు, యువరాణిల ఆవేదన ఎప్‌స్టీన్ లైంగిక కుంభకోణంలో మైనారిటీ బాధితుల తరఫున బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేథరీన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో అనేక మంది బాధితుల వివరాలు ఉండటం తమను కలచివేసిందని వారు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
పారిస్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడి రాజీనామా
అయితే ఈ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ యువరాజు ఆండ్రూ పేరును వారు ప్రస్తావించలేదు. పారిస్‌లో ఎప్‌స్టీన్ ఫైళ్లలో పేరు రావడంతో ఫ్రాన్స్ మాజీ మంత్రి జాక్ లాంగ్ పారిస్ కల్చరల్ సెంటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎప్‌స్టీన్‌తో ఆయనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్‌వో మిట్టరాండ్ ప్రభుత్వ హయాంలో జాక్ లాంగ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 86 ఏళ్ల లాంగ్‌ను కార్యాలయానికి హాజరుకావాలని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఆదివారం సమన్లు జారీ చేసింది. అయితే ఆయన అంతకుముందే పదవి నుంచి తప్పుకున్నారు.
వివరాలు
నార్వే రాయబారి రాజీనామా
ఓస్లోలో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య 1990లలో శాంతి ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించిన నార్వే రాయబారి మోనా జూల్స్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇటీవలి వరకూ జోర్డాన్‌లో విధులు నిర్వహించారు. ఈ ఆరోపణలతో ఇటీవలే ఆమెను సస్పెండ్ చేశారు.