Page Loader
h-1b visa: హెచ్‌-1బి వీసాల్లో కీలక మార్పు.. లాటరీకు బదులు జీతం ఆధారంగా ఎంపిక?
హెచ్‌-1బి వీసాల్లో కీలక మార్పు.. లాటరీకు బదులు జీతం ఆధారంగా ఎంపిక?

h-1b visa: హెచ్‌-1బి వీసాల్లో కీలక మార్పు.. లాటరీకు బదులు జీతం ఆధారంగా ఎంపిక?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని కార్యవర్గం తాజాగా హెచ్‌-1బి వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ క్రమంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) రూపొందించిన ప్రతిపాదనను శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ కార్యాలయానికి పంపింది. ప్రస్తుతం హెచ్‌-1బి వీసాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్ణయిస్తుంటుంది. ప్రస్తుతం ఇది 85,000 వీసాలుగా ఉంది. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులకే కేటాయించారు. యూనివర్శిటీలలోని పరిశోధనా విభాగాలకు పరిమితులు లేకుండా వీసాలు జారీ చేస్తున్నారు. ఇక 2026ఏడాదికి సంబంధించిన వార్షిక కోటాకు అనుగుణంగా ఇప్పటికే తగినంత దరఖాస్తులు వచ్చేసిన నేపథ్యంలో..యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది.

Details

ప్రస్తుతం లాటరీ విధానంలో నిర్వహణ

దీంతో వచ్చే ఏడాది హెచ్‌-1బి లాటరీ విధానం కొనసాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం వీసా ఎంపిక ప్రక్రియను లాటరీ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అక్టోబర్ నాటికి ఖరారవుతాయి. అయితే ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని మార్చారు. అప్పుడు కంపెనీలు ఉద్యోగికి ఇచ్చే వేతన స్థాయిని ఆధారంగా తీసుకుని వీసాలు మంజూరు చేశారు. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ప్రోత్సహించడం. అంతేగాక, తక్కువ జీతాల ఉద్యోగాలకు విదేశీయుల నియామకాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో 'బై అమెరికన్, హైర్ అమెరికన్' విధానాన్ని పాటించారు.

Details

జీతం, అనుభవం ఆధారంగా వీసాలు జారీ చేయాలి

అయితే 2021లో జో బైడెన్‌ అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు తిరిగి ట్రంప్‌ వర్గం మార్పులకు శ్రీకారం చుట్టగా.. DHS ప్రతిపాదనపై ఇప్పటికే 1,000 పబ్లిక్ కామెంట్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. ఈ ప్రతిపాదన అమలైతే హెచ్‌-1బి ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉంటారని హెచ్చరించారు. లాటరీ విధానంతో పెద్ద పెద్ద కంపెనీలు అనేక దరఖాస్తులు చేసుకుని అధిక వీసాలు పొందుతున్నట్టు విమర్శలున్నాయి. జనవరిలో 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రొగ్రెస్‌' అనే మేధోమథన సంస్థ ఈ విధానాన్ని తొలగించాలని సూచించింది. జీతం, అనుభవం ఆధారంగా వీసాలు జారీ చేస్తే ఆర్థిక పరంగా వాటి విలువ 88 శాతం పెరుగుతుందని ఆ సంస్థ పేర్కొంది