Kuwait: వేసవి తీవ్రతతో కువైట్ లో కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలు తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
కువైట్‌లో వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని నియంత్రించడం, నేషనల్ పవర్ గ్రిడ్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత అధికంగా ఉండే వేసవి నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల పని గంటలను రోజుకు ఆరు గంటలకు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు ఏడు గంటలు పనిచేస్తుండగా, వాటిని ఆరు గంటలకు కుదించాలనే ప్రతిపాదనకు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వేసవి కాలంలో ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిiకి చేరుకుంటాయి.
వివరాలు
భారీగా పెరిగిన ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం
ఈ సమయంలో ఎయిర్ కండీషనర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్ నెట్‌వర్క్‌లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ పీక్ అవర్స్‌లో పవర్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రణాళికలో భాగంగానే పని వేళల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా, విద్యుత్ లోడ్‌ను తగ్గించే చర్యల్లో భాగంగా పలు ఫ్యాక్టరీలు కూడా గరిష్ట డిమాండ్ సమయాల్లో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తగ్గించిన పని వేళలు వేసవి కాలంలో మూడు నెలల పాటు అమల్లో ఉండనున్నాయని అధికారులు తెలిపారు.
వివరాలు
మూడు నెలల పాటు అమలు
దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, అమలు కార్యాచరణను సివిల్ సర్వీస్ కమిషన్ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ మార్నింగ్ అటెండెన్స్ విండోను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే పరిమితం చేయనున్నారు. అదేవిధంగా సాయంత్రం షిఫ్టులు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్‌ను హేతుబద్ధంగా వినియోగించేందుకు విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు అదనపు చర్యలను అమలు చేస్తోంది. ఇంధన వనరులను పొదుపుగా వినియోగిస్తూ, గరిష్ట వినియోగ సమయాల్లో పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరగకుండా ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగ అలవాట్లు అలవరుచుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.