LOADING...
USA- Iran: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ కీలక భేటీ.. పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం దొరకనా?
ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ కీలక భేటీ.. పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం దొరకనా?

USA- Iran: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ కీలక భేటీ.. పశ్చిమాసియా సంక్షోభానికి పరిష్కారం దొరకనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2026
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ చర్చల కోసం ఇరుదేశాల ప్రతినిధులు వచ్చే వారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. పశ్చిమాసియా సంఘర్షణకు శాశ్వత పరిష్కారం కనుగొనే లక్ష్యంతో అమెరికా, ఇరాన్‌లు 14 అంశాలతో కూడిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముందని వార్తలు చెబుతున్నాయి. ఈ ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల బదిలీ, అలాగే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు వంటి కీలక అంశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలి

ఇక తమపై అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ మొదటి నుంచే డిమాండ్ చేస్తోంది. ఇదే అంశం ఇప్పటివరకు చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజా చర్చలు సానుకూలంగా సాగితే ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అంశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి నేడు స్పందన వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తోందా అని విలేకరులు ప్రశ్నించగా, త్వరలోనే పరిస్థితి స్పష్టమవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వివరాలు

అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే అంశాన్ని అమెరికా యంత్రాంగం పరిశీలిస్తోందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే ఈ కార్యక్రమాన్ని 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్'గా విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇందులో నౌకల రక్షణతో పాటు అదనపు చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

వివరాలు

తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు యూఎన్‌లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ లేఖ రాశారు. ఆ లేఖలో హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక చర్యలకు పాల్పడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అలాగే పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.

Advertisement