LOADING...
Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్‌ కలకలం
మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్‌ కలకలం

Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్‌ కలకలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

మాలిలో మరోసారి భారతీయుల కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి లోని కోబ్రి ప్రాంతంలో ఐదుగురు భారతీయులను దుండగులు అపహరించినట్లు సమాచారం వెలువడింది. ఈ ఘటనపై భద్రతా వర్గాలు నిర్ధారణ తెలిపినట్టు స్థానిక మీడియా నివేదికలు వెల్లడించాయి. విద్యుదీకరణ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చేపడుతున్న ఓ సంస్థలో ఈ భారతీయులు సాంకేతిక ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు మాలి భద్రతా అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆ ప్రాంతంలోకి చొరబడి అకస్మాత్తుగా దాడి చేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను బలవంతంగా తీసుకెళ్లిపోయారని వర్గాలు వెల్లడించాయి.

Details

సురక్షిత ప్రాంతాలకు భారతీయులు

ఘటన జరిగిన తర్వాత, ఆ సంస్థలో పనిచేస్తున్న ఇతర భారతీయ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కిడ్నాప్ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కూడా ధృవీకరించినప్పటికీ, అపహరించిన వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఇక ఇప్పటివరకు ఈ కిడ్నాప్‌ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ముఠా గానీ, ఉగ్రవాద గ్రూప్‌ గానీ ప్రకటన చేయలేదు. అయితే భద్రతా వర్గాలు ఈ ఘటన వెనుక స్థానిక ఉగ్రవాద సంస్థలే ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. గమనించదగిన విషయం ఏమిటంటే 2012 నుండి మాలిలో తిరుగుబాటు, ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.

Details

ఇటీవల ముగ్గురు విదేశీయులు కిడ్నాప్

విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు జరగడం అక్కడ సాధారణమైపోయింది. ఇటీవల సెప్టెంబరులో ముగ్గురు విదేశీయులు కూడా కిడ్నాప్‌కు గురయ్యారు. కొంత డబ్బు చెల్లించడంతో గత వారం వారిని విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మాలిలో సైనిక పాలన కొనసాగుతోంది. దేశంలో అల్‌-ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ అనుబంధ దుండగుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తవారిని అణచివేయడానికి సైన్యం చర్యలు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి.