LOADING...
H-1B Fee Hike: ఎల్‌-1, ఒ-1 వీసాలు.. హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!
ఎల్‌-1, ఒ-1 వీసాలు.. హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!

H-1B Fee Hike: ఎల్‌-1, ఒ-1 వీసాలు.. హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయ మార్గాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో (USA) టెక్ ఉద్యోగాల కోసం కీలకమైన హెచ్‌-1బీ వీసా ఫీజు 1,00,000 డాలర్ల(సుమారు రూ.88 లక్షలు) కు పెరగడంతో భారత యువత నిరాశలో మునిగింది. అయితే అగ్రరాజ్యంలో ఉద్యోగాలు పొందడానికి హెచ్‌1బీ మాత్రమే మార్గం కాదు. కొన్ని ప్రత్యామ్నాయ వీసాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టెక్ కంపెనీలు వాటిని పరిశీలిస్తున్నాయి. ముఖ్యమైనవి ఎల్‌-1 (L-1), ఒ-1 (O-1)వీసాలు. హెచ్‌1బీతో పోలిస్తే వీటి ఫీజులు తక్కువ, కానీ ఎంపిక విధానం కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒ-1 వీసాకు 12,000 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. దీని కోసం లాటరీ లేదా పరిమితి విధానం లేదు. గణాంకాల ప్రకారం దరఖాస్తు చేసిన వారిలో 93% మందికి లభించింది, కాగా హెచ్‌-1బీకి 73% దరఖాస్తులు తిరస్కరించారు.

Details

ఎల్‌-1 వీసాలు

బహుళ జాతీయ కంపెనీలు విదేశీ బ్రాంచుల నుంచి అమెరికాలోని బ్రాంచులలో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్, మేనేజర్లకు (L-1A) లేదా నిపుణులకోసం (L-1B) ఇస్తాయి. అభ్యర్థి ఆ కంపెనీలో కనీసం 1 సంవత్సరం పని చేసి ఉండాలి, అది దరఖాస్తు చేసిన 3 సంవత్సరాల్లో ఉండాలి. ఈ వీసా కంపెనీ పేరెంట్ లేదా సబ్సిడరీ బ్రాంచ్‌కి సంబంధించినది కావాలి. ఎల్‌1 వీసా ద్వారా భవిష్యత్తులో EB-1C గ్రీన్ కార్డు పొందవచ్చు. L-1B కింద వీసా పొందేవారు ఆ రంగంలో నిపుణుడని నిరూపించాలి. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఎల్‌1 వీసాలలో 26% భారతీయులకు ఇచ్చారు, 10 సంవత్సరాల క్రితం ఇది 30% వరకు ఉండేది.

Details

ఒ-1 వీసాలు 

ఆర్ట్స్, సైన్స్, విద్య, బిజినెస్, అథ్లెటిక్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులకు ఇవ్వబడే నాన్-ఇమిగ్రెంట్ వీసా. టీవీ, ఫిల్మ్ రంగంలోని ప్రతిభావంతులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దరఖాస్తుదారుడి ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రంగానికి చేసిన సేవలు, గుర్తింపు విజయాల ద్వారా నిరూపించాలి. 8 ప్రమాణాల్లో కనీసం 3 ప్రమాణాలను చేరుకోవాలి. ఈ వీసాను 3 సంవత్సరాల పాటు ఇచ్చి, తరువాత ఏడాది చొప్పున పొడిగించవచ్చు. పనిచేయడం లేదా స్వయంఉపాధి చేసుకోవడం కోసం ఉపయోగించవచ్చు. గతేడాది 19,457 ఒ-1 వీసాలు జారీ అయ్యాయి.

Details

 హెచ్‌1బీ ఫీజు పెంపు ప్రభావం 

కొత్త ఫీజు ప్రకారం, భారత కంపెనీలు హెచ్‌1బీ వీసాలు పొందాలంటే ప్రతి కంపెనీకి అదనంగా 150-550 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. ఇది వారి ఉత్పత్తులు, సేవల ఖర్చును కూడా గణనీయంగా పెంచుతుంది. మొత్తంగా, హెచ్‌1బీ ఫీజు పెంపు భారం భారత కంపెనీలపై భారమైనప్పటికీ, ఎల్‌1, ఒ-1 వంటి ప్రత్యామ్నాయ మార్గాలు వీసా పొందడానికి సౌకర్యాలను అందిస్తున్నాయి.