LOADING...
Brazil: రియో డి జనీరోలో భారీ ఆపరేషన్‌.. 64 మంది మృతి
రియో డి జనీరోలో భారీ ఆపరేషన్‌.. 64 మంది మృతి

Brazil: రియో డి జనీరోలో భారీ ఆపరేషన్‌.. 64 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో రెడ్ కమాండ్‌ గ్యాంగ్‌పై భారీ స్థాయి ఆపరేషన్‌ను భద్రతా బలగాలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌ సమయంలో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, అందులో కొంతమంది అధికారులు కూడా ఉన్నారని సమాచారం. దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా గుంపులలో రెడ్ కమాండ్‌ ప్రముఖమైనదిగా గుర్తించబడింది. ఈ ముఠాపై దాడి చేసేందుకు భద్రతా సంస్థలు సుమారు ఏడాది పాటు ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో దాదాపు 2,500 మంది సాయుధ సిబ్బంది పాల్గొన్నారు.

వివరాలు 

75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం

కొన్ని గంటల పాటు కొనసాగిన కాల్పుల్లో నలుగురు భద్రతాధికారులు సహా 60 మంది మృతి చెందగా, మరో 81 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ దాడిలో 75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసినట్లు సమాచారం. రియో చరిత్రలో ఇదే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆపరేషన్‌గా పేర్కొన్నారు. దాడుల నేపథ్యంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్‌కు ప్రతీకారంగా, అధికారులను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్‌లు డ్రోన్‌లతో దాడి ప్రయత్నాలు చేసినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు అవసరం: సీసార్ మయోజన్

ఈ దాడుల నడుమ కూడా భద్రతా బలగాలు వెనక్కి తగ్గకుండా ఆపరేషన్‌ను కొనసాగించాయని పేర్కొంది. అయితే, ఈ హింసాత్మక చర్యలను పలు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్ బ్రెజిల్ డైరెక్టర్ సీసార్ మయోజన్ మాట్లాడుతూ, "ఇది ఎంతో విషాదకరమైన ఘటన, దీని మీద స్వతంత్ర దర్యాప్తు అవసరం ఉంది" అని తెలిపారు. అంతేకాకుండా, ఈ సంఘటనపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం కూడా స్పందించి, ఇది తమను భయభ్రాంతులకు గురి చేసిందని పేర్కొంటూ, తక్షణ దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది.

Advertisement