Sheikh Hasina: 'ఇప్పుడే బయలుదేరండి'.. భారత్ నుంచి వచ్చిన ఆ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది!
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పుడు, దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి భారత్‌కు ఆశ్రయం కోసం వచ్చిన విషయం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ముష్కరుల దాడి నుంచి ఆమె కేవలం 20 నిమిషాల వ్యవధిలో తప్పించుకుని సురక్షితంగా భారత్‌కు చేరుకున్నట్లు సమాచారం. అయితే, ఆమె ప్రాణాలను కాపాడింది భారత్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ అని తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆధారంగా రూపొందించిన 'ఇన్షా అల్లా బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రెవెల్యూషన్' అనే పుస్తకం త్వరలో విడుదల కానుంది.
Details
అల్లర్ల నేపథ్యం
ఇందులో హసీనా పరార్ డ్రామా, భారత ప్రభుత్వ పాత్ర, ఆ కాలంలోని రాజకీయ పరిణామాలు వంటి ఆసక్తికర వివరాలు ఉన్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు విపరీతంగా హింసాత్మకంగా మారాయి. ఆ ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపు తప్పడంతో, అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె గణభవన్ అధికారిక నివాసం నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే నిరసనకారులు ఆ ప్రాంగణంలోకి చొరబడ్డారు. అదృష్టవశాత్తూ అప్పటికే ఆమె సురక్షితంగా బయటపడి ఉండటం ఆమె ప్రాణాలను రక్షించింది.
Details
భారత్ ఫోన్ కాల్ - కీలక మలుపు
ఆ సమయంలో పరిస్థితులు తీవ్రమవుతున్నప్పటికీ, షేక్ హసీనా 'నేను బంగ్లాదేశ్ విడిచి వెళ్లను' అని ధృడంగా చెప్పినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అయితే, ఆమెను దేశం విడిచి వెళ్లేలా ఒప్పించేందుకు ఆమె సోదరి రెహానా, అమెరికాలో ఉన్న కుమారుడు సజీబ్ వాజీద్, అలాగే బంగ్లా ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్, నేవీ చీఫ్‌లు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదే సమయంలో 2024 ఆగస్టు 4న మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ కాల్ చేసిన వ్యక్తి హసీనాకు బాగా పరిచయమున్న ఒక భారతీయ ఉన్నతాధికారి అని పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సంభాషణ చాలా క్లుప్తంగా జరిగినప్పటికీ, అత్యంత ప్రభావవంతమైనది.
Details
భవిష్యత్తులో పోరాడండి
ఆ అధికారి హసీనాకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. వెంటనే గణభవన్ నుంచి బయటకు రండి. ప్రాణాలతో ఉండటమే ముఖ్యమని, భవిష్యత్తులో పోరాటం కొనసాగించండి అని హెచ్చరించారు. ఆ మాటలు విన్న హసీనా తీవ్ర షాక్‌కు గురై దేశం విడిచి వెళ్లే నిర్ణయం తీసుకోవడానికి సుమారు అరగంట సమయం తీసుకున్నట్లు ఆ పుస్తకంలో ఉంది. హసీనా దేశం విడిచి వెళ్ళే ముందు ఓ చివరి ప్రసంగం రికార్డు చేయాలని భావించారని, కానీ ముష్కరులు ఏ క్షణమైనా లోపలికి చొచ్చుకురావచ్చని భావించి సైన్యాధికారులు దానిని అనుమతించలేదని పేర్కొన్నారు. ఆ పరిస్థితిలో సోదరి రెహానా స్వయంగా హసీనాను కారులో కూర్చోబెట్టారని, ఆ తర్వాత హెలికాప్టర్ బయలుదేరిందని వివరించారు.
Details
భారతదేశానికి పారిపోవడం
పుస్తకంలోని వివరాల ప్రకారం మధ్యాహ్నం 2.33 గంటలకు హసీనా ప్రయాణించిన చాపర్ బంగ్లాదేశ్ నుంచి టేకాఫ్ అయి, సుమారు అరగంటలో భారత్‌లో దిగింది. భారత్ ముందుగానే తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చిందని, ఆ తర్వాత ఢిల్లీలో ఆమెకు భారత ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆ రోజు భారత్ నుంచి ఆ ఫోన్ కాల్ రాకపోయి ఉంటే, హసీనా కూడా తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ లాగా హత్యకు గురయ్యే ప్రమాదం ఉందని ఆ పుస్తకంలో ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈ పుస్తకం షేక్ హసీనా జీవితంలోని అత్యంత నాటకీయ ఘట్టాన్ని వెలుగులోకి తెస్తోంది.