
Hafiz Saeed: పహల్గాం దాడి తర్వాత లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు నాలుగు రెట్ల భద్రతను పెంచిన పాక్ ఆర్మీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ దాడి అనంతరం,పాకిస్థాన్ ప్రభుత్వం లష్కరే తోయిబా చీఫ్,అత్యంత ప్రమాదకర ఉగ్రవాది హఫీజ్ సయీద్ భద్రతను భారీగా పెంచింది.
గతంతో పోలిస్తే నాలుగింతల భద్రతా చర్యలు తీసుకున్నట్టు పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
లాహోర్‌లోని జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్టు ఇటీవల వెల్లడైంది.
అతడి ఇంటి చుట్టూ పాకిస్తాన్ సైన్యం,ఐఎస్‌ఐ,లష్కరే ముఠా సభ్యులు కట్టుదిట్టమైన పహారా ఏర్పాటు చేశారు.
అంతేకాక,ఆ ప్రాంతంలో నిరంతరం డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టినట్టు సమాచారం.
హఫీజ్ నివాస పరిసర ప్రాంతంలో నాలుగు కి.మీ పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
వివరాలు
డ్రోన్లపై నిషేధం
అతడి ఇంటి దగ్గరకు సాధారణ పౌరులెవరినీ అనుమతించకూడదన్న నిబంధనల్ని అక్కడ అమలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
అంతేగాక, ఆ ప్రాంతంలో సైన్యం నిర్వహించే డ్రోన్లు మినహాయించి ఇతర డ్రోన్లపై నిషేధం విధించబడింది.
పహల్గాం దాడికి 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' ముష్కరులు పాల్పడ్డారని నిఘా వర్గాలు చెబుతున్నా, వారి వెనుక హఫీజ్ సయీద్ మద్దతు ఉందన్న అనుమానాలు ఇప్పటికే బయటపడ్డాయి.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అతడిపై ఎటువంటి దాడులు జరగకుండా చూడటమే లక్ష్యంగా పాక్ ప్రభుత్వం భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.
వివరాలు
ఒసామా, అజార్ కంటే భిన్నంగా జనావాసాల్లో హఫీజ్..!
గతంలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్‌లో ఉన్న రహస్య ప్రదేశంలో తలదాచుకున్నాడు.
అది జనావాసాల నుంచి దూరంగా ఉండటం వల్లే అమెరికా అతనిపై దాడి చేయగలిగింది.
మసూద్ అజార్ వంటి ఉగ్రనేతలు కూడా పర్వత ప్రాంతాల్లో దాక్కొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కానీ హఫీజ్ మాత్రం వీరికి భిన్నంగా జనావాసాల మధ్యే నివాసముండటం గమనార్హం. ఇదంతా పాక్ మూర్ఖ యోచనగా భావించవచ్చు.
ఎందుకంటే, జనాభా మధ్యలో ఉంటే అతనిపై దాడులు జరిగితే సాధారణ ప్రజలకూ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో, దేశాలు వెనక్కి తగ్గవచ్చన్న దురాలోచన ఉందనే అభిప్రాయం వెల్లివిరుస్తోంది.