Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్‌తో పాటు 8 మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
టర్కీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈదుర్ఘటనలో లిబియా ఆర్మీ చీఫ్ జనరల్ ముహమ్మద్ అలీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపై లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్‌హమీద్ ద్బీబా సంతాపం తెలిపారు.ఈ వార్త ఎంతో బాధ కలిగించిందని తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. టర్కీ పర్యటన పూర్తిచేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈప్రమాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది లిబియాకు తీరని నష్టమని ఆయన అభివర్ణించారు.ఆర్మీ చీఫ్‌తో పాటు మరో నలుగురు ఉన్నతాధికారులు కూడా మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. లిబియా సైనికాధికారి సహా మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం మంగళవారం టర్కీ రాజధాని అంకారాలో నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది.
వివరాలు
విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం
విమానంలో నలుగురు అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు లిబియా అధికారులు వెల్లడించారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని వారు తెలిపారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నత స్థాయి రక్షణ చర్చల కోసం లిబియా ప్రతినిధి బృందం అంకారాలో ఉన్నట్లు టర్కీ అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇతర అధికారులు ఎవరో కూడా లిబియా ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
కేసిక్కావాక్ గ్రామ సమీపంలో ఫాల్కన్-50 రకం బిజినెస్ జెట్ శిథిలాలు
వారిలో లిబియా గ్రౌండ్ ఫోర్సెస్ అధిపతి జనరల్ అల్-ఫితౌరి గ్రైబిల్, మిలిటరీ తయారీ అథారిటీ నేత బ్రిగేడియర్ జనరల్ మహమూద్ అల్-ఖతావి, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు సలహాదారుగా ఉన్న మొహమ్మద్ అల్-అసవి డియాబ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయంలో పనిచేసే మిలిటరీ ఫోటోగ్రాఫర్ మొహమ్మద్ ఒమర్ అహ్మద్ మహజౌబ్ ఉన్నారు. అంకారాకు దక్షిణంగా సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హేమానా జిల్లాలోని కేసిక్కావాక్ గ్రామ సమీపంలో ఫాల్కన్-50 రకం బిజినెస్ జెట్ శిథిలాలు లభ్యమైనట్లు టర్కీ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం అంకారాలోని ఎసెన్‌బోగా విమానాశ్రయం నుంచి లిబియాకు బయలుదేరిన తర్వాత విమానంతో సంప్రదింపులు తెగిపోయాయని టర్కీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెల్లడించారు.
వివరాలు
హేమానా ప్రాంతం వద్ద విమానం అత్యవసర ల్యాండింగ్ సంకేతం
రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం దాదాపు 40 నిమిషాల తర్వాత రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థల నుంచి అదృశ్యమైందని టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సంబంధాలు పూర్తిగా తెగిపోవడానికి ముందు హేమానా ప్రాంతం వద్ద విమానం అత్యవసర ల్యాండింగ్ సంకేతాన్ని పంపినట్లు ఆయన చెప్పారు. అత్యవసరంగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం రాడార్ నుంచి మాయమైనట్లు టర్కీ అధ్యక్ష కార్యాలయ కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి బుర్హానెట్టిన్ డ్యూరాన్ తెలిపారు. విమానంలో విద్యుత్ సమస్య తలెత్తినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరినట్లు చెప్పారు.
వివరాలు
ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు నలుగురు ప్రాసిక్యూటర్ల నియామకం
దీంతో విమానాన్ని తిరిగి ఎసెన్‌బోగా విమానాశ్రయానికి మళ్లించగా, అప్పటికే అత్యవసర ల్యాండింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు నలుగురు ప్రాసిక్యూటర్లను నియమించినట్లు టర్కీ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దర్యాప్తులో టర్కీ అధికారులకు సహకరించేందుకు లిబియా కూడా ప్రత్యేక బృందాన్ని అంకారాకు పంపనున్నట్లు వెల్లడించింది.