Israeli Bunkers: యుద్ధ భయాల్లో ఇజ్రాయెల్ ప్రజలు: బంకర్లలోనే జీవితం,పెళ్లిళ్లు కూడా అక్కడే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సాధారణ ప్రజల జీవితం పూర్తిగా మారిపోయింది. ఇరాన్ నుంచి ఎడతెరిపి లేకుండా వస్తున్న క్షిపణి దాడుల కారణంగా వేలాది మంది పౌరులు నెలరోజులుగా బంకర్లలోనే గడుపుతున్నారు. బయటకు రావడమే ప్రమాదంగా మారడంతో, చాలామంది తమ రోజువారీ జీవితాన్ని కాంక్రీట్ గదుల మధ్యే కొనసాగిస్తున్నారు. ఆహారం, నిద్ర, విశ్రాంతి.. అన్నీ బంకర్లలోనే పరిమితమయ్యాయి. కొంతమంది బయటకు వచ్చినా, సైరన్ మోగగానే మళ్లీ షెల్టర్లలోకి పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి వేడుకలు కూడా ఇప్పుడు బంకర్లలోనే జరుగుతున్నాయి. ప్రాణాలను కాపాడే ఈ గదులు భౌతిక రక్షణ ఇస్తున్నా, మానసికంగా, సామాజికంగా ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
వివరాలు
ప్రతి ఇంట్లో 'మమద్' - ప్రాణరక్షక గది
ఇజ్రాయెల్‌లో బంకర్‌ను 'మమద్' అని పిలుస్తారు. 1992 తర్వాత నిర్మించిన ప్రతి ఇంటిలో ఈ సురక్షిత గది తప్పనిసరిగా ఉండేలా చట్టం అమలులో ఉంది. బయటకు చూస్తే ఇది సాధారణ గదిలానే కనిపించినా, గోడలు బలమైన కాంక్రీటుతో నిర్మిస్తారు. కిటికీలు, తలుపులు ఉక్కుతో తయారవుతాయి. శాంతి సమయాల్లో ఈ గదిని పడకగదిగా లేదా కార్యాలయంగా ఉపయోగిస్తారు. కానీ యుద్ధం ప్రారంభమైన వెంటనే ఇది బాంబు షెల్టర్‌గా మారుతుంది. అదనంగా, ప్రభుత్వం సామూహిక బంకర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. రోడ్లపై నడుస్తున్న వారు కూడా అత్యవసర సమయంలో వెంటనే చేరుకునేలా అనేక ప్రదేశాల్లో షెల్టర్లు అందుబాటులో ఉంచారు. సొంతంగా 'మమద్' లేని వారు ప్రభుత్వ బంకర్లు లేదా మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందుతున్నారు.
వివరాలు
సైరన్ మోగితే.. కేవలం 90 సెకన్లే
సైరన్ మోగిన వెంటనే ప్రజలకు సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఇది 15 నుంచి 90 సెకన్ల మధ్యలో ఉంటుంది. అందుకే ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. నిద్రలో ఉన్నా, స్నానం చేస్తున్నా... సైరన్ వినిపించగానే క్షణాల్లో బంకర్లలోకి చేరాల్సిందే. ఇది వారి రోజువారీ జీవితంలో భాగమైపోయింది.
వివరాలు
బంకర్లలో అత్యవసర కిట్లు తప్పనిసరి
ప్రతి కుటుంబం తమ బంకర్‌లో ఎప్పుడూ ఒక అత్యవసర కిట్ సిద్ధంగా ఉంచుతుంది. ఇందులో కనీసం మూడు రోజుల పాటు సరిపడా నీరు, నిల్వ ఉండే ఆహారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అవసరమైన మందులు ఉంటాయి. అదే విధంగా పవర్ బ్యాంకులు, రేడియో, టార్చ్‌లైట్లు కూడా సిద్ధంగా ఉంచుతారు. పిల్లల కోసం ఆటబొమ్మలు, పుస్తకాలు కూడా ఏర్పాటు చేస్తారు. సామూహిక బంకర్లలో మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
వివరాలు
టెక్నాలజీతో ముందస్తు హెచ్చరికలు
ప్రతి ఇజ్రాయెలీ పౌరుడి మొబైల్‌లో 'రెడ్ అలర్ట్' యాప్ ఉంటుంది. ఇది క్షిపణి దాడుల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. అలాగే బంకర్లలో వైఫై సదుపాయం ఉండటంతో, ప్రజలు బయట పరిస్థితులను తెలుసుకుంటూ ఉంటారు. ఇది వారికి కొంతమేర మానసిక ధైర్యాన్ని ఇస్తోంది.
వివరాలు
బంకర్లలోనే వేడుకలు… కొత్త సంస్కృతి
క్షిపణి దాడుల భయంతో నగరాల్లో సైరన్లు ఎప్పుడైనా మోగే పరిస్థితి నెలకొంది. దీంతో వేడుకలను వాయిదా వేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బంకర్లే కొత్త వేదికలుగా మారాయి. ఇటీవల ఒక జంట అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో వివాహం జరుపుకుంది. అక్కడ ఆశ్రయం పొందిన అపరిచితులే అతిథులుగా మారి ఆశీర్వదించడం ప్రత్యేకతగా నిలిచింది. యువతలో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక డేటింగ్ యాప్ కూడా ప్రారంభమైంది. బంకర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, లోపల ఉన్న సింగిల్స్ వివరాలు తెలుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో యువత బంకర్లను చిన్న డిస్కోలుగా మార్చి, భయాన్ని మరచిపోయే ప్రయత్నం చేస్తున్నారు.