Pentagon: పెంటగాన్‌లో హైఅలర్ట్.. ప్రమాదకర పదార్థాల అనుమానంతో లాక్‌డౌన్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదకర పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో అక్కడి భద్రతా అలారం వ్యవస్థ అప్రమత్తం కావడంతో అధికారులు వెంటనే అత్యవసర చర్యలు చేపట్టారు. పెంటగాన్‌లోని పలు అంతస్తులు, కారిడార్‌లను లాక్‌డౌన్ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై అగ్నిమాపక దళం, అత్యవసర వైద్య సేవల విభాగాలు నిఘా పెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
వివారాలు
అత్యవసర నిబంధనలు అమలు
ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. గాలి నాణ్యతకు సంబంధించిన అసాధారణ పరిస్థితిని అక్కడి భద్రతా వ్యవస్థలు గుర్తించాయని ఆయన వెల్లడించారు. సమస్య తీవ్రతపై స్పష్టత వచ్చే వరకు ముందు జాగ్రత్త చర్యలుగా కొన్ని ప్రాంతాల్లో అత్యవసర నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే అక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.