Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. సోమవారం తెల్లవారుజామున మజార్-ఎ-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూగర్భ శాస్త్ర సంస్థ (యుఎస్ జియోలాజికల్ సర్వే) వెల్లడించింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి సుమారు 28 కిలోమీటర్ల (17.4 మైళ్లు) లోతులో నమోదైందని పేర్కొంది. ప్రాణనష్టం ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రకంపనల వల్ల భారీగా నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక భూకంపం సంభవించిన తర్వాత మజార్-ఎ-షరీఫ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
వివరాలు
ప్రాణనష్టం,ఆస్తినష్టం వివరాలను అంచనా వేస్తున్న అధికారులు
భూప్రకంపనల తీవ్రతతో ఇళ్లూ భవనాలూ కంపించాయి. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 5.23 లక్షల జనాభా కలిగిన మజార్-ఎ-షరీఫ్ నగరంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు, పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఆ ప్రాంత ప్రజలను ఇప్పటికే ఆందోళనకు గురిచేస్తుండగా, ఇప్పుడు ఈ భూకంపం ఆఫ్ఘనిస్థాన్‌ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత ఆగస్టులో ఆ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో వెయ్యి మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టిన ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భయభ్రాంతులకు గురైన మజార్-ఎ-షరీఫ్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు
CCTV footage shows the moment a strong M6.3 earthquake struck Mazar-e-Sharif, Afghanistan, a short while ago. pic.twitter.com/NX0o04Ggi5
— Weather Monitor (@WeatherMonitors) November 2, 2025