Trump mulling: అమెరికా కలలకు భారీ బ్రేక్.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాలోనే ఉద్యోగం చేయాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల నుంచి లక్ష డాలర్ల (సుమారు రూ.95 లక్షలు) రుసుము వసూలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధించాలని ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను బోస్టన్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమంపై కొత్త నిబంధన తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకూ భారీ బాండ్?
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా, అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల నుంచి కూడా లక్ష డాలర్ల బాండ్ తీసుకునే అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అమెరికాకు వచ్చి తర్వాత పౌరసత్వం పొందిన అనంతరం ఈ బాండ్ మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఓపీటీపై కొత్త ప్రతిపాదన
ప్రస్తుతం అమెరికాలో ఎఫ్-1 విద్యార్థి వీసాతో చదువు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)' కార్యక్రమం ద్వారా తమ విద్యకు సంబంధించిన రంగాల్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు చట్టబద్ధంగా ఉద్యోగం చేసే అవకాశం పొందుతున్నారు.
2024 గణాంకాల ప్రకారం ప్రస్తుతం 4.19 లక్షల మంది విదేశీయులు OPT కింద అమెరికాలో పనిచేస్తున్నారు.
అయితే ఈ ఓపీటీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
అయితే దీనిపై స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతినిధి.. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఓపీటీ లేకపోతే పరిస్థితి?
అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి పలు ప్రతిపాదనలపై నిరంతరం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఓపీటీ వల్లే విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అనంతరం అమెరికాలో కొంతకాలం ఉద్యోగం చేసే అవకాశం పొందుతున్నారు.
ఒకవేళ ఈ విధానంలో భారీ రుసుము విధించినా లేదా పరిమితులు తీసుకొచ్చినా.. చాలా మంది విద్యార్థులు చదువు పూర్తికాగానే అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
వివరాలు
భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3.63 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.
అంటే అమెరికాలోని ప్రతి ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడే. మన దేశానికి చెందిన విద్యార్థుల్లో సుమారు 40 శాతం మంది OPT కార్యక్రమాన్ని ఎంచుకుంటున్నారు.
వీరిలో చాలామంది విద్యా రుణాలపై ఆధారపడి అమెరికాకు వెళ్తున్నారు.
ఇప్పటికే అక్కడ పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు భారంగా మారగా.. కొత్తగా లక్ష డాలర్ల రుసుము అమల్లోకి వస్తే అది మరింత ఆర్థిక భారం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ఇతర దేశాలవైపు మొగ్గు?
ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే భారతీయ విద్యార్థులు కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాలవైపు మొగ్గు చూపే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే అమెరికాలో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులు ఎంచుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.