Donald Trump: భారత్ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు: ట్రంప్ వాణిజ్య విధానాన్ని విమర్శించిన మాజీ వాణిజ్య కార్యదర్శి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ వాణిజ్య మంత్రి జినా రెమాండో భారత్ పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానం తప్పిదమని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మిత్రదేశాలను దూరం చేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన విధానాల కారణంగా భారత్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి అని ఆమె హెచ్చరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెన్నడీ స్కూల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
మిత్రదేశాలతో అనుబంధం కోల్పోతే అమెరికా బలహీన దేశంగా మారుతుంది
అమెరికాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పడం ఒక వైపు ఉంటే, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం బలహీనపడేలా, ఏకాకిగా మారేలా చర్యలు తీసుకోవడం వినాశకరమైన విషయం. ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలు దేశానికి అవసరమైన ఆర్థిక,వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తున్నాయి. ఐరోపా, జపాన్‌ల వంటి మిత్రదేశాలతో అనుబంధం కోల్పోతే అమెరికా బలహీన దేశంగా మారుతుంది. ఐరోపా, ఆగ్నేయాసియాతో పటిష్టమైన సంబంధాలు లేకుండా ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపడం అసాధ్యం. అందుకే ఐరోపాతో వాణిజ్య బంధాలను మరింత బలపరచాలని నేను కోరుకుంటున్నాను. అలాగే భారత్ విషయంలో ట్రంప్ పెద్ద పొరపాటు చేస్తున్నారు అని నా అభిప్రాయం," అని రెమాండో వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు
అంతేకాక,ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్య దేశాలతో అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని రెమాండో ఆరోపించారు. వాషింగ్టన్ తన సంబంధాలను చక్కదిద్దుకునేవరకు మిగతా ప్రపంచం వేచిచూడదని హెచ్చరించారు. ప్రస్తుతం చైనా ఐరోపా,ఆఫ్రికా,లాటిన్ అమెరికా,ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరించుకుంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు,రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ప్రతీకారంగా ట్రంప్ ప్రభుత్వం భారత్ ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్యఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్న సమయంలో ఈ సుంకాలు అమలు చేశారు. అదనంగా,ట్రంప్ భారత్‌పై తీవ్రపదజాలంతో విమర్శలు చేయడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈపరిణామాల నేపథ్యంలోనే మాజీ వాణిజ్య మంత్రి జినా రెమాండో ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.