Malaysia: భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు చేసిన మలేషియా.. కొత్త నిబంధనలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. 2027 జనవరి 1 నుంచి భారత పౌరులకు ఈ వెసులుబాటు అందుబాటులో ఉండదు. ప్రభుత్వం మళ్లీ ఏవైనా మార్పులు ప్రకటిస్తే తప్ప, మలేషియాకు వెళ్లాలనుకునే భారతీయ పాస్‌పోర్ట్‌దారులంతా ప్రయాణానికి ముందే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వీసా పొందాల్సి ఉంటుంది.
వివరాలు
జనవరి 1 నుంచి భారతీయులకు వీసా తప్పనిసరి
ఇప్పటివరకు భారతీయులు ఎలాంటి వీసా లేకుండానే మలేషియాలోకి ప్రవేశించే అవకాశం ఉండేది.
వ్యాపారం, పర్యాటకం, సామాజిక అవసరాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ట్రాన్సిట్ ప్రయాణాల కోసం గరిష్ఠంగా 30 రోజుల పాటు అక్కడ ఉండేందుకు అనుమతి ఉండేది.
అయితే కొత్త నిర్ణయంతో ఈ సౌకర్యం ముగియనుంది. నవంబర్ 17న విడుదల చేసిన ప్రకటనలో మలేషియా ఇమ్మిగ్రేషన్ విభాగం (JIM) ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
2027 జనవరి 1 నుంచి భారత పౌరులకు వీసా మినహాయింపు సౌకర్యం వర్తించదని వెల్లడించింది.
మలేషియాలోకి ప్రవేశించాలనుకునే భారతీయులు తమ ప్రయాణానికి ముందుగానే వీసా పొందాలని సూచించింది.
2026 డిసెంబర్ 1 నుంచి 'MyVISA' పోర్టల్ ద్వారా వీసా దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపింది.
వివరాలు
మలేషియా ప్రవేశానికి పాస్‌పోర్ట్, ఆర్థిక స్థోమత తప్పనిసరి..
వీసా మినహాయింపు వర్తించని దేశాల పౌరులు మలేషియాలోకి ప్రవేశించేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కనీసం ఆరు నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. అలాగే మలేషియాలో బస చేసే కాలానికి సరిపడా ఆర్థిక స్తోమత ఉందని నిరూపించే పత్రాలను కూడా సమర్పించాలి.
కాగా, మలేషియాలో అమల్లో ఉన్న 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని ఉద్యోగాల కోసం ఉపయోగించుకోవద్దని కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ గతంలోనే భారతీయులను హెచ్చరించింది.
ఈ మేరకు రెండు నెలల క్రితం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం తాజాగా వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వివరాలు
మలేషియా కొత్త వీసా నిబంధనలు ఇవే..
కొత్త నిబంధనల ప్రకారం మలేషియాకు వెళ్లే సందర్శకులు తమ పర్యటన మొత్తం కాలానికి సరిపడా ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ (ప్రయాణ వైద్య బీమా) తీసుకోవాల్సి ఉంటుంది.
విదేశాల నుంచి వచ్చే ప్రవాసేతరులు (Non-residents) వైద్య చికిత్స, ఇతర ఆరోగ్య సేవలకు సంబంధించిన ఖర్చులను పూర్తిగా తామే భరించాలి.
వీసా దరఖాస్తు సమయంలో సహాయక పత్రంగా ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఇమ్మిగ్రేషన్ విభాగం సూచించింది.
ఈ ధ్రువీకరణ పత్రాన్ని వైద్య బీమా, అత్యవసర సహాయ సేవలు అందించే ఇన్‌బౌండ్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ 'MyTripPass' ద్వారా పొందవచ్చని తెలిపింది.
వీసా దరఖాస్తుకు దీనిని అవసరమైన పత్రంగా ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది.
వివరాలు
మలేషియా కొత్త వీసా నిబంధనలు ఇవే..
మరోవైపు వీసా దరఖాస్తుల విషయంలోనూ మలేషియా ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది.
ఏదైనా వీసా దరఖాస్తు 'New Application' (కొత్త దరఖాస్తు) లేదా 'Pending Payment' (చెల్లింపు పెండింగ్) స్థితిలో ఏడు పని దినాలకు మించి ఉంటే.. దానంతట అదే గడువు ముగిసినట్లుగా పరిగణించి రద్దవుతుంది.
ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. 2026 సెప్టెంబర్ 1కి ముందు సమర్పించిన దరఖాస్తులతో పాటు, ఆ తర్వాత చేసిన దరఖాస్తులకూ ఇది వర్తిస్తుంది.
వివరాలు
మలేషియా కొత్త వీసా నిబంధనలు ఇవే..
ఒకవేళ దరఖాస్తు గడువు ముగిసి రద్దయితే, ప్రయాణికులు అప్‌డేట్ చేసిన వీసా దరఖాస్తు ఫారమ్‌ను ఉపయోగించి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే వీసా దరఖాస్తు ఫలితం ఎలా ఉన్నా, విధానాల్లో మార్పులు వచ్చినా, ప్రయాణ ప్రణాళికలు మారినా చెల్లించిన వీసా రుసుమును తిరిగి చెల్లించరు.
అంటే వీసా ఫీజు పూర్తిగా నాన్-రిఫండబుల్ అని మలేషియా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.