LOADING...
Maldives: ధూమపాన నిషేధం విధించిన మొదటి దేశంగా మాల్దీవులు 
ధూమపాన నిషేధం విధించిన మొదటి దేశంగా మాల్దీవులు

Maldives: ధూమపాన నిషేధం విధించిన మొదటి దేశంగా మాల్దీవులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

పొగాకు వాడకంపై కఠిన చర్యలు చేపట్టిన మాల్దీవులు, ప్రపంచంలోనే మొదటిగా 'తరాల వారీ పొగతాగడం నిషేధం' (Generational Smoking Ban) అమలు చేసిన దేశంగా నిలిచింది. ఈ నూతన చట్టం ప్రకారం 2007 జనవరి 1 తరువాత జన్మించిన ఎవరైనా పొగాకు ఉత్పత్తులు కొనడం, అమ్మడం పూర్తిగా నిషేధం. ఈ చట్టం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశాన్ని "టోబాకో-ఫ్రీ జనరేషన్" వైపు తీసుకెళ్లడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇది ప్రజారోగ్య పరిరక్షణలో చారిత్రాత్మక అడుగుగా పేర్కొంది.

ధూమపానం గణాంకాలు 

మాల్దీవులలో ధూమపాన స్థాయి 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా పొగతాగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మాల్దీవుల్లో 2021లో నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం, 15 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు గల పెద్దల్లో నాలుగో వంతు మంది పొగాకు వాడుతున్నట్లు తేలింది. 13 నుంచి 15 ఏళ్ల మధ్య టీనేజ్ వయస్సు గల పిల్లల్లో ఈ శాతం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉందని నివేదిక చెబుతోంది. పోల్చితే, అమెరికాలో 2022లో 20% మంది పెద్దలు, బ్రిటన్‌లో 2023లో 12% మంది పెద్దలు పొగతాగేవారిగా నమోదయ్యారు.

పొగాకు నియంత్రణ 

పొగతాగడాన్ని తగ్గించే కొత్త చర్యలు

ఈ చట్టం మాల్దీవులు చేపట్టిన పొగాకు వ్యతిరేక యుద్ధంలో కీలక ఘట్టంగా నిలుస్తోంది. 2024 చివరలో ప్రభుత్వం అన్ని వేపింగ్ ఉత్పత్తులను కూడా వయస్సుతో సంబంధం లేకుండా నిషేధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా "ఆంటీ స్మోకింగ్ క్లినిక్స్" ఏర్పాటు చేసి, "స్మోక్-ఫ్రీ దీవులు"గా మారిన ప్రాంతాలకు నగదు బహుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. దీని ద్వారా పొగతాగడాన్ని మరింతగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ పోకడలు 

ఇలాంటి చట్టాలు ఆలోచించిన ఇతర దేశాలు

ఇలాంటి తరాల వారీ పొగాకు నిషేధ చట్టాన్ని అమలు చేసిన దేశం మాల్దీవులే మొదటిది అయినప్పటికీ, ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. న్యూజిలాండ్ 2022లో 2009 జనవరి 1 తరువాత జన్మించిన వారికి పొగాకు అమ్మకాన్ని నిషేధించే చట్టం దాదాపు ఆమోదించింది. కానీ ఏడాది తరువాత పన్ను తగ్గింపుల కోసం ఆ చట్టాన్ని రద్దు చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా ఇటీవలి సంవత్సరాల్లో ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, అవి ఇంకా అమల్లోకి రాలేదు. మాల్దీవుల ఈ కొత్త చట్టం ప్రపంచ దేశాలకు ప్రేరణగా నిలవొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.