Maldives: పార్లమెంటులో మాల్దీవుల అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు
మాల్దీవుల పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అయితే మాల్దీవుల రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన మాల్దీవియన్ డెమొక్రాటిక్, డెమొక్రాట్‌లు సమావేశంలో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ చైనాకు దగ్గర కావడం, భారత్ పట్ల ఆయన అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌తో వివాదం తర్వాత పార్లమెంటులో ముయిజ్జూ ప్రసంగం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో అధ్యక్షుడిపై అభిశంసనను కూడా తీసుకురావడానికి ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మొదలైన వివాదం
గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు రెండూ భారతదేశాన్ని తమ దీర్ఘకాలిక మిత్రదేశంగా అభివర్ణించాయి. ప్రస్తుత ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నదని రెండు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాత భారత్ దానిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.