Maldives: భారతదేశం ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు.. మాల్దీవుల రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
భారతదేశం సహాయం కోసం ఇచ్చిన మూడు విమానాలను నడిపే సామర్థ్యం ఉన్న ఒక్క పైలట్ కూడా ప్రస్తుతం తమ సైన్యంలో లేరని మాల్దీవుల ద్వీప దేశం రక్షణ మంత్రి ఘసన్ మౌసౌన్ అంగీకరించారు. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఆదేశాల మేరకు భారత్ కొద్దిరోజుల క్రితం 76 మంది సైనిక సిబ్బందిని వెనక్కి పిలిపించింది. అయితే,ఈ సైనిక సిబ్బంది స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పౌర ఉద్యోగులు ఉన్నారు. శనివారం రాష్ట్రపతి కార్యాలయంలో ఘసన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో, మాల్దీవులలో రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేట్ చేయడానికి మోహరించిన భారతీయ సైనికులను ఉపసంహరించుకోవడం గురించి,వారి స్థానంలో భారతదేశం నుండి పౌర ఉద్యోగులను పిలిపించడం గురించి ఆయన తెలియజేశారు.
76మంది ఆర్మీ సిబ్బందిని వెనక్కి పిలిచిన భారత్
మాల్దీవుల జాతీయ రక్షణ దళం(ఎంఎన్‌డిఎఫ్)లో భారత సైన్యం విరాళంగా ఇచ్చిన మూడు విమానాలను నడపగల సైనికులు ఎవరూ లేరని ఓ విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో విమానాలు నడిపేందుకు మాల్దీవుల సైనికులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభమైనా ఆ కార్యక్రమం పూర్తి కాలేదని చెప్పారు. మే 10లోగా భారత సైనికులందరినీ ఉపసంహరించుకోవాలని చైనా అనుకూల నేత ముయిజు అభ్యర్థించారు. ఈ విమానాలను నడపడానికి ఈ సైనిక సిబ్బందిని అక్కడ మోహరించారు.భారత్ ఇప్పటికే 76మంది ఆర్మీ సిబ్బందిని వెనక్కి పిలిచింది. ముయిజు ఈచర్య తర్వాత,రెండు దేశాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తత నెలకొంది. సోనాహియా మిలిటరీ ఆసుపత్రి నుంచి వైద్యులను తొలగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని మాల్దీవుల మీడియా కథనం తెలిపింది.