
Canada: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం.. మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఈ పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో మార్క్ కార్నీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, లిబరల్ పార్టీ 145 స్థానాల్లో విజయం సాధించగా, అదనంగా మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ 134 స్థానాలను గెలుచుకుంది. ఇంకా 13 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది.
మరోవైపు, ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించగా, అదనంగా ఒక చోట ఆధిక్యం కలిగి ఉంది.
వివరాలు
ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం
కలిస్థానీ భావజాలానికి అనుకూలంగా ఉన్న జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ఈసారి ప్రజలను ఆకర్షించలేకపోయింది.
ఈ పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో గెలుపొందగా,మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఈ నిస్సత్తువైన ఫలితాల నేపథ్యంలో జగ్మీత్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
కెనడా పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలున్నాయి.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
లిబరల్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా,అది ఇప్పటివరకు గెలిచిన స్థానాల సంఖ్య ఆధారంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది.
దీంతో మార్క్ కార్నీ మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కలిగేలా కనిపిస్తోంది.
వివరాలు
ఓటమిని ఒప్పుకున్నా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలివ్రా
ఇదివరకే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలివ్రా తన పార్టీ ఓటమిని ఒప్పుకున్నారు.
ఈఎన్నికలు అంతర్జాతీయంగా కూడ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికాతో కొనసాగుతున్న సుంకాల వివాదం,కెనడాను యూఎస్ 51వరాష్ట్రంగా చేర్చాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అంతేగాక,భారత్‌తో కొనసాగుతున్న దౌత్యసంబంధిత విభేదాలు కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిని కేంద్రీకరించాయి.
ఈఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత,లిబరల్ పార్టీ ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి మార్క్ కార్నీని ప్రధానిగా ఎంపిక చేసింది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కార్నీ అనంతరం ముందస్తు ఎన్నికలు నిర్వహించారు.
కెనడా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28న ఓటింగ్ జరిగినప్పటికీ,వెంటనే ఓట్లలెక్కింపు ప్రారంభమై, ప్రస్తుతం ఫలితాలు బయటపడుతున్నాయి.