Page Loader
Nasrallah: హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా అంత్యక్రియలకు పోటెత్తిన జనం..  కిక్కిరిసిపోయిన బీరూట్ స్టేడియం

Nasrallah: హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా అంత్యక్రియలకు పోటెత్తిన జనం..  కిక్కిరిసిపోయిన బీరూట్ స్టేడియం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ మద్దతుతో పనిచేస్తున్న హిజ్బుల్లా సంస్థకు చెందిన మాజీ ప్రధాన నేత హసన్‌ నస్రల్లా (64) అంత్యక్రియలకు వేలాది మంది ఆయన అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. దీనివల్ల లెబనాన్‌ రాజధాని బీరూట్‌ వీధులు కిక్కిరిసిపోయాయి.నగర శివారులోని స్టేడియంలో హెజ్బొల్లా మద్దతుదారుల నినాదాలు మారుమోగాయి. గత ఏడాది సెప్టెంబరులో ఇజ్రాయేల్‌ వైమానిక దాడుల్లో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు నెలల అనంతరం బీరూట్‌లో ఆయనకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

వివరాలు 

కామిల్లే చమౌన్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో నస్రల్లా, సఫీద్దీన్‌ భౌతికకాయాలు 

నస్రల్లా కుటుంబ సభ్యుడు, హెజ్బొల్లా వారసుడిగా భావిస్తున్న హషీమ్‌ సఫీద్దీన్‌కు కూడా ఇదే కార్యక్రమంలో తుదివీడ్కోలు పలికారు. ఈ రెండు ప్రముఖ నేతలకు నివాళులర్పించేందుకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. లెబనాన్‌లో అతిపెద్ద క్రీడా ప్రాంగణమైన బీరూట్‌ శివారులోని కామిల్లే చమౌన్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో నస్రల్లా, సఫీద్దీన్‌ భౌతికకాయాలను ఉంచారు. వారి చివరి దర్శనం కోసం మహిళలు, చిన్నారులు సహా వేలాదిగా ప్రజలు గడ్డకట్టే చలిని పట్టించుకోకుండా తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు 

బీరూట్‌ గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 

అంత్యక్రియల సందర్భంగా బీరూట్‌ గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్‌ 27న బీరూట్‌ దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయేల్‌ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో నస్రల్లాతో పాటు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన డిప్యూటీ కమాండర్‌ జనరల్‌ అబ్బాస్‌ నీలోఫరసన్‌ సహా పలువురు హెజ్బొల్లా నేతలు మరణించారు. కొన్నిరోజుల తర్వాత మరో దాడిలో సఫీద్దీన్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో వీరి భౌతికకాయాలను తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. అయితే, హెజ్బొల్లా ఇటీవల అధికారికంగా వీరి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

ఘనంగా  నస్రల్లా, సఫీద్దీన్‌ అంత్యక్రియలు 

ఈ నేపథ్యంలో, బీరూట్‌లో నస్రల్లా, సఫీద్దీన్‌ అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. వారి శవపేటికలను ఆదివారం ప్రజల సందర్శనార్థం బీరూట్‌ శివారులోని స్టేడియానికి తరలించారు. శనివారం నుంచే హెజ్బొల్లా మద్దతుదారులు స్టేడియానికి చేరుకున్నారు. మొత్తం 50,000 మందికి వీలైన స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో పాటు, అదనంగా వేలాదిగా సీట్లు ఏర్పాటు చేశారు.

వివరాలు 

65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు

ఈ కార్యక్రమానికి 65 దేశాల నుంచి 800 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇరాన్‌ తరఫున ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘెర్‌ ఖాలిబఫ్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో బీరూట్‌ గగనతలంలో ఇజ్రాయేల్‌ యుద్ధ విమానాలు సంచరించడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇజ్రాయేల్‌ రక్షణ మంత్రి కాట్జ్‌ స్పందిస్తూ, తమకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ దేశానికైనా ఇదే పరిస్థితే ఎదురవుతుందంటూ హెచ్చరించారు. ఇక, తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయేల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది.