Loading...
Earthquake: పనామాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు!
పనామాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు!

Earthquake: పనామాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
10:14 am

ఈ వార్తాకథనం ఏంటి

పనామా దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఈ విపత్తు చోటుచేసుకుంది. భూకంపం ధాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భూకంపం సంభవించిన తర్వాత 40కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. వరుస ప్రకంపనలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాలు

పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం

పనామా పసిఫిక్‌ తీరానికి సమీపంలోని హెర్రెరా ప్రావిన్స్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

భూమికి 12.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూకంప తీవ్రత దృష్ట్యా తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు.

మరోవైపు ఈ విపత్తు కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

సహాయక చర్యలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT