FBI: అమెరికాలో భారీ మోసం.. భారత్‌లో పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్ వాంటెడ్ నిందితుడు మంజీత్ సింగ్ బేడీ అరెస్టయ్యాడు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వానికి బేడీ దాదాపు 6 లక్షల డాలర్ల నష్టం కలిగించినట్లు ఆయన తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ కమిషనరేట్ పరిధిలో బేడీని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతడిని అమెరికాకు తీసుకెళ్లేందుకు ఎఫ్‌బీఐ ప్రస్తుతం చర్యలు చేపడుతోందని కాష్ పటేల్ తెలిపారు. వాషింగ్టన్‌లోని టాకోమాలో (Tacoma) బేడీ ఓ చిన్న కిరాణా దుకాణాన్ని నిర్వహించేవాడు. అక్కడ అమెరికా ప్రభుత్వ ఆహార సహాయ పథకం 'స్నాప్' (SNAP) లబ్ధిదారుల ఈబీటీ (EBT) కార్డులను దుర్వినియోగం చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
మోస్ట్ వాంటెడ్ మోసగాళ్ల జాబితాలో అతని పేరు
ఎఫ్‌బీఐ వివరాల ప్రకారం.. SNAP లబ్ధిదారుల ఈబీటీ కార్డులను స్వైప్ చేసి, అందుకు బదులుగా వారికి ఆహార పదార్థాలు ఇవ్వకుండా నగదు అందించేవాడు.
ఇలా కార్డుల ద్వారా వచ్చిన మొత్తంలో సగం తన వద్దే ఉంచుకునేవాడని అధికారులు తెలిపారు. ఈ విధంగా 2024 మార్చి నుంచి 2025 జూన్ మధ్య బేడీ మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు బేడీ పాస్‌పోర్టును అప్పగించాలని, అలాగే వాషింగ్టన్ రాష్ట్రాన్ని దాటి వెళ్లకూడదని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బేడీ భారత్‌కు పారిపోయినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది.
ఎఫ్‌బీఐ కొత్తగా రూపొందించిన మోస్ట్ వాంటెడ్ మోసగాళ్ల జాబితాలో అరెస్టయిన ఐదో వ్యక్తి మంజీత్ సింగ్ బేడీ అని కాష్ పటేల్ వెల్లడించారు.