న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్
ఇజ్రాయెల్‌లో రక్షణమంత్రి యోవ్ గల్లంట్‌ను తొలగించడం, న్యాయ విధానంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డేక్కారు. వేలాది మంది వీదుల్లోకి వచ్చి న్యాయ సంస్కరణల ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు నీలం, తెలుపు ఇజ్రాయెల్ జెండాలను ఊపుతూ వీధుల్లోకి వచ్చారు. జెరూసలేంలో ఆందోళనకారులు నెతన్యాహు ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు, సైనికులు ప్రదర్శనకారులపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు, తాను జైలుకు వెళ్లకుండా ఉండేందుకు అంతిమ ప్రయత్నంలో భాగంగా తనకు అనుకూలంగా న్యాయ సంస్కరణలను తీసుకొస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేయడం ద్వారా విచారణల నుంచి తప్పించుకోవచ్చని నెతన్యాహు భావిస్తున్నారని విమర్శకులు చెబుతున్నారు.
సమ్మెకు దిగిన ట్రేడ్ యునియన్ కార్మికులు
నిరసనలు దేశవ్యాప్తంగా కొనసాగడంతో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాలను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలోని అతిపెద్ద ట్రేడ్ యూనియన్ అయిన ఎయిర్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునిచ్చింది. విమాన మార్పుల వల్ల పదివేల మంది ప్రభావితమవుతారని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయ ప్రక్రియను ఆపాలని యూనియన్ నాయకుడు అర్నాన్ బార్ బెంజమిన్ నెతన్యాహుకు అల్టిమేటం జారీ చేశారు.