ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు
ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఏ దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు. బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరికి నిర్వహించిన ఆర్టీ -పీసీఆర్ పరీక్షల్లో కరోనా కొత్త వేరియంట్ బయట పడిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వేరియంట్‌ను పరీక్షించిన ఆరోగ్య శాఖ అధికారులు BA.1(ఒమిక్రాన్), BA.2 కలయిక కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ వేరియంట్ బయటపడ్డ వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలను ఉన్నట్లు, వారి వయస్సు 30 ఏళ్లు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఒకే సెల్‌లో రెండు వైరస్లు ఉండటం వల్లే కొత్త వేరియంట్: నిపుణులు
కరోనా కొత్త వేరియంట్‌పై ఇజ్రాయెల్ కోవిడ్ నిపుణుడు ప్రొఫెసర్ సల్మాన్ జర్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే సెల్‌లో రెండు వైరస్లు ఉండటం వల్ల ఇది జరగుతుందని చెప్పారు. రెండు వైరస్‌లు గుణించి, జన్యు పదార్థాన్ని మార్పిడి చేసుకుంటాయని ఆ తర్వాత కొత్త వైరస్ ఏర్పడుతుందని ప్రొఫెసర్ వివరించారు. ఇజ్రాయెల్‌లో ఓమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ BA.2 ఇన్‌ఫెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ ఆ దేశ ఆరోగ్య మంత్రి నిట్జాన్ హోరోవిట్జ్‌ను కలిశారు. మూడు డోస్‌ల టీకాలు వేయాలని సూచించారు. అలాగే ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.