Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య
రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి. బోటికోవ్ (47) గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పని చేస్తున్నారు. ఒక ఆగంతకుడు బోటికోవ్ ఇంట్లోకి చొరబడి డబ్బు కోసం అతడిని హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది.
హత్య చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ
బోటికోవ్ హత్య చేసిన 29 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. అతను ఇంతకు ముందు 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడని 'డైలీ మెయిల్' నివేదించింది. విచారణలో నిందితుడు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రష్యాకు చెందిన ఇన్వెస్టిగేటివ్ కమిటీ నిందితుడిని చాలా తక్కువ సమయంలోనే పట్టుకున్నట్లు 'డైలీ మెయిల్' పేర్కొంది. 2021లో కోవిడ్ వ్యాక్సిన్‌పై చేసిన కృషికి గానూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతుల మీదుగా 'ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ఫాదర్‌ల్యాండ్' అవార్డును బోటికోవ్ అందుకున్నారు. 2020లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన 18మంది శాస్త్రవేత్తలలో బోటికోవ్ ఒకరు.