దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. గురువారం ఒక్కరోజే 754కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది. దేశంలో కొన్ని నెలలుగా కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, అయితేకొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల పెగుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు.
కేంద్రం సూచనలను సమర్థవంతంగా పాటించాలి: ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్
కరోనా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను సమర్థవంతంగా పాటించాలని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని భూషణ్ సూచించారు. కరోనా కేసులు, ఇన్‌ఫ్లూయెంజా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ఎస్ఏఆర్ఐ) కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కోల్పోకుండా, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రిస్క్ అసెస్‌మెంట్-ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని భూషణ్ నొక్కి చెప్పారు.