B-52 Stratofortress: అమెరికా బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్: గాల్లో ఎగిరే ఉక్కు డేగ శక్తి ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
అది ఒక భారీ ఉక్కు డేగలా కనిపించే యుద్ధ విమానం. ఒకసారి గాల్లోకి ఎగిరితే శత్రు ప్రాంతాలపై సుమారు 38 టన్నుల బాంబులను కురిపించే సామర్థ్యం దీనికుంది. గగనతలం నుంచే సముద్రంలోని లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని పర్యవేక్షించగలదు. ఒక యుద్ధ సమయంలో మొత్తం ప్రయోగించిన బాంబుల్లో దాదాపు 40 శాతం బాంబులు ఈ విమానాల నుంచే పడినవి. యుద్ధ విమానాల ప్రపంచంలో ఇది అనకొండలా శక్తివంతంగా భావిస్తారు. ఈ విమానమే అమెరికా బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్. అమెరికా వాయుసేనకు ఇది చాలా కీలకమైన యుద్ధ వాహనం. బి-2 స్పిరిట్ లాంటి విమానాల్లా పెద్దగా ప్రచారం పొందకపోయినా, బి-52 మాత్రం ప్రశాంతంగా తన పని తాను పూర్తి చేస్తూ ఉంటుంది.
వివరాలు
అమెరికా వాయుసేనలో పాత బాంబర్
అమెరికా వాయుసేన వద్ద ఉన్న బాంబర్ విమానాల్లో బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ చాలా పాత మోడళ్లలో ఒకటి. ఇది మొదటిగా 1955లో అమెరికా వాయుసేనలో చేరింది. మొత్తం 744 బి-52 విమానాలు తయారయ్యాయి. వాటిలో చివరిగా రూపొందించిన బి-52హెచ్ వేరియంట్ 1962లో తయారైంది. దీన్ని చూస్తే ఈ విమానం ఎంత పాతదో అర్థమవుతుంది. ఒక్క బి-52 విమానం ఏకకాలంలో 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా ఈ విమానాలను వినియోగిస్తోంది. కోల్డ్‌వార్ కాలంలో ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్‌గా ప్రత్యర్థులకు భయాన్ని కలిగించింది. వియత్నాం యుద్ధ సమయంలో మాత్రం దీనిని సాధారణ బాంబర్‌లా ఉపయోగించారు. తాజాగా ఇరాన్‌పై దాడులకు కూడా బి-52లను వినియోగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
వివరాలు
దాదాపు వందేళ్లు సేవలు..
బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ విమానాల ఎయిర్‌ఫ్రేమ్‌లు దాదాపు 100 సంవత్సరాలు సేవలు అందించగలవని అమెరికా వాయుసేన అంచనా వేస్తోంది. కొత్త ఇంజిన్లు అమర్చడం ద్వారా 2050 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని వినియోగించవచ్చని ఇంపీరియల్ వార్ మ్యూజియమ్స్ నివేదిక పేర్కొంది.
వివరాలు
వేగం తక్కువైనా… విధ్వంసం అపారం
ఈ స్ట్రాటోఫోర్ట్రెస్ విమానాలు ఆకారంలో చాలా భారీగా కనిపిస్తాయి. ఇవి సబ్‌సోనిక్ వేగంతో గరిష్ఠంగా 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు. యుద్ధరంగంలో వీటిని ప్రధానంగా.. వ్యూహాత్మక దాడులు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ కౌంటర్ ఎయిర్ ఆపరేషన్లు సముద్ర యుద్ధ చర్యలు కోసం ఉపయోగిస్తారు. 1990లలో ఇరాక్‌పై నిర్వహించిన డిజర్ట్ స్ట్రామ్ ఆపరేషన్‌లో మొత్తం బాంబుల్లో 40% బాంబులను బి-52లే ప్రయోగించాయి. దీంతో అమెరికా ఈ విమానాలపై ఎంతగా ఆధారపడుతుందో తెలుస్తుంది.
వివరాలు
వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగల విమానం
ఈ విమానాలు వివిధ రకాల ఆయుధాలను మోసుకెళ్లగలవు. వాటిలో.. అణు బాంబులు లేజర్ గైడెడ్ బాంబులు క్లస్టర్ బాంబులు బంకర్ బస్టర్ బాంబులు గ్రావిటీ బాంబులు జీపీఎస్ గైడెడ్ ఆయుధాలు ఒక్క బి-52 విమానం 30 జీబీయూ-31 శ్రేణి బంకర్ బస్టర్ బాంబులను తీసుకెళ్లగలదు. కానీ ఎఫ్-15 ఫైటర్ జెట్ మాత్రం కేవలం రెండు మాత్రమే తీసుకెళ్లగలదు. ఈ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత రీఫ్యూయలింగ్ లేకుండానే 14,080 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
వివరాలు
రెండు విమానాలు చాలు..
బి-52 విమానాలు సముద్ర ప్రాంతాల్లో నిఘా కార్యకలాపాలు కూడా సమర్థంగా నిర్వహిస్తాయి. సముద్రంపై కేవలం రెండు బి-52 విమానాలు గాల్లో ఉంటేనే 3,64,000చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే కార్యకలాపాలను గుర్తించగలవు. ఈ విమానాల్లో.. రెండు ఎలక్ట్రో-ఆప్టికల్ వీక్షణ సెన్సర్లు ఫార్వర్డ్ లుకింగ్ ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థ ఆధునిక టార్గెటింగ్ సిస్టమ్ బ్యాటిల్ అసెస్‌మెంట్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. పైలట్లు నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి రాత్రిపూట కూడా ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ విమానాలు ఎగరాలంటే పొడవైన రన్‌వే అవసరం. అందుకే అమెరికా యూకేలోని ఫెయిర్‌ఫోర్డ్ ఎయిర్‌బేస్‌ను ఇరాన్‌పై దాడుల కోసం వినియోగిస్తోంది. అక్కడ 3.2కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉంది. అలాగే ఇరాన్‌కు సమీపంలో ఉన్న డియాగో గార్సియా స్థావరం కూడా బి-52విమానాల వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.
వివరాలు
బాగ్దాద్‌పై భారీ దాడి
ఇరాక్‌పై అమెరికా నిర్వహించిన ఆపరేషన్ డిజర్ట్ స్ట్రామ్‌లో బి-52 విమానాలు కీలక పాత్ర పోషించాయి. 1996 సెప్టెంబర్ 2,3 తేదీల్లో రెండు బి-52హెచ్ విమానాలు బాగ్దాద్‌పై 13 క్రూజ్ క్షిపణులను ప్రయోగించాయి. ఈ దాడుల్లో బాగ్దాద్‌లోని కమ్యూనికేషన్ కేంద్రాలు,విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఈ విమానాలు లూసియానాలోని బార్క్స్‌డేల్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరి దాదాపు 34 గంటల పాటు ప్రయాణించి దాడులు నిర్వహించాయి.
వివరాలు
తాలిబన్, ఐసిస్‌పై దాడుల్లో కీలకం
2001లో అఫ్గానిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్‌లో బి-52 విమానాలు తాలిబన్ దళాలపై భారీ దాడులు చేశాయి. తరువాత ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్‌లో కూడా ఇవి పాల్గొన్నాయి. సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో ఐసిస్ ఉగ్రవాదులను అణచివేయడంలో కూడా బి-52ల పాత్ర ఎంతో ముఖ్యమైంది. 2016లో ఈ బాంబర్ విమానాలు దాదాపు 1800 దాడి మిషన్లలో పాల్గొని ఐసిస్‌కు భారీ నష్టం కలిగించాయి. ఇక ఇరాన్‌పై దాడుల్లో కూడా ఈ విమానాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా కేవలం మూడు రోజుల్లో 2,000 లక్ష్యాలపై బాంబింగ్ చేయగలిగిందంటే దానికి బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌లే ప్రధాన కారణం.
వివరాలు
అణ్వాయుధాలతో ప్రయాణంలో ప్రమాదాలు
ఈ భారీ బాంబర్ విమానాలు అణ్వాయుధాలను మోసుకెళ్తున్న సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చరిత్రలో నమోదయ్యాయి. 1966లో స్పెయిన్‌లోని పాలోమారెస్ ప్రాంతం వద్ద ఒక బి-52 విమానం కేసీ-135 ట్యాంకర్ విమానాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బి-52లో ఉన్న నాలుగు థర్మోన్యూక్లియర్ బాంబులు మధ్యధరా సముద్రంలో పడిపోయాయి. అదృష్టవశాత్తూ అవి పేలలేదు. తరువాత అమెరికా వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 1968లో గ్రీన్‌ల్యాండ్‌లో మరోసారి బి-52 విమానం కూలిపోయింది. అలాగే 1961లో నార్త్ కరోలినా సమీపంలో మార్క్-39 శ్రేణికి చెందిన రెండు అణుబాంబులతో వెళ్తున్న బి-52 ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో కూడా అణ్వాయుధాలు దెబ్బతిన్నాయి.