మొసలిని పెళ్లాడిన మెక్సికో మేయర్; కారణం ఇదే
దక్షిణ మెక్సికోలోని సాన్ పెడ్రో హుమెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో సోసా మొసలిని పెళ్లి చేసుకున్నారు. గొప్ప భవిష్యత్తును, అదృష్టాన్ని తీసుకువస్తుందన్న నమ్మకంతో తమ ఆచారంలో భాగంగా ఆడమొసలిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగిందని ఆయన చెప్పారు. మొసలితో పెళ్ళి జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రేమ లేకుండా పెళ్ళి చేసుకోవడం సరైన పని కాదని, తనకు ప్రేమ, బాధ్యత ఉన్నాయని మేయర్ చెప్పుకొచ్చినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్లడించింది. స్థానిక కథనాల ప్రకారం, గతంలో ఒకానొక మహారాణిని మొసలితో పోల్చేవారట. అప్పటి నుంచి మొసలిని పెళ్ళి చేసుకుంటే ఆ మహారాణిని పెళ్ళి చేసుకున్నట్టే ఇక్కడి వారు భావిస్తారు.
230సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఆచారం
ఈ వివాహ సాంప్రదాయం 230సంవత్సరాల క్రితం ప్రారంభమైందని సమాచారం. చోంతల్, హావే అనే రెండు సమూహాల మధ్య శాంతిని నింపడానికి చోంతల్ రాజు ఆడమొసలిని వివాహం చేసుకున్నారట. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మొసలిని పెళ్లి చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వివాహ వేడుకకు ముందు మొసలిని ఇంటికి తీసుకెళ్లి డ్యాన్సులు చేశారు. రక్షణ కోసం మొసలి నోటికి తాడు కట్టారు. అ తర్వాత మొసలిని బాగా అలంకరించి వివాహ వేడుకకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మొసలితో మేయర్ డ్యాన్స్ చేశాడు. అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మొసలి ముక్కుపై మేయర్ ముద్దు పెట్టుకోవడంతో వివాహ వేడుక ముగిసింది.