LOADING...
Putin Warns Ukraine: శాంతి చర్చలకు దూరమైతే సైనిక చర్యలు తప్పవు.. ఉక్రెయిన్‌కు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
శాంతి చర్చలకు దూరమైతే సైనిక చర్యలు తప్పవు.. ఉక్రెయిన్‌కు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

Putin Warns Ukraine: శాంతి చర్చలకు దూరమైతే సైనిక చర్యలు తప్పవు.. ఉక్రెయిన్‌కు పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్‌ ముందుకు రాకపోతే, సైనిక మార్గాలను అనుసరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ భేటీ కానున్న నేపథ్యంలో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల రష్యా మిలిటరీ కమాండ్‌ పోస్టును పుతిన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ వాలెరీ గెరిసిమోవ్‌తో పాటు రష్యన్‌ సైనిక దళాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

Details

శాంతి చర్చల పట్ల ఉక్రెయిన్ పెద్దగా ఆసక్తి లేదు

అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ అధికారులు శాంతియుత పరిష్కారానికి ఆసక్తి చూపకపోతే, ప్రత్యేక సైనిక చర్యల ద్వారా తమ లక్ష్యాలను సాధిస్తామని స్పష్టం చేశారు. శాంతి చర్చల పట్ల ఉక్రెయిన్‌ అధికారుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదని, సమస్యను పరిష్కరించేందుకు వారు తొందరపడటం లేదని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ట్రంప్‌తో సమావేశానికి ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కెనడా ప్రధాని మార్క్‌ కార్నీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కార్నీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు రష్యా సహకారం తప్పనిసరిగా అవసరమని అన్నారు. కీవ్‌పై ఇటీవల మాస్కో జరిపిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అదేసమయంలో ఉక్రెయిన్‌కు అదనంగా 2.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని కెనడా అందిస్తుందని కార్నీ ప్రకటించారు.

Advertisement