West Asia: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉధృతం.. ఖతార్, కువైట్‌పై డ్రోన్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత ఉదృతమవుతున్నాయి. తాజా పరిణామాల్లో భాగంగా ఖతార్‌లోని దోహా నగరానికి సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్‌పై గుర్తుతెలియని క్షిపణి దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై యూకే సముద్ర వ్యవహారాల అథారిటీ కీలక వివరాలను వెల్లడించింది. పోర్టు సమీపంలో నిలిచిఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ క్షిపణి దాడి కారణంగా నౌక ఎడమవైపు భాగం దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎలాంటి చమురు లీకేజీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని వెల్లడించారు.
వివరాలు
కువైట్‌లో డ్రోన్ దాడి.. భారీ అగ్ని ప్రమాదం
ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత అరేబియా గల్ఫ్, హర్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకలపై దాడులు పెరిగినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 26 దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) వెల్లడించడం గమనార్హం. ఇదిలా ఉంటే, కువైట్‌లోనూ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడి నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడి అనంతరం అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించి, పరిసర ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి.
వివరాలు
ఇంధన ట్యాంకర్లకు గణనీయమైన నష్టం
ఈ విషయాన్ని దేశ పౌర విమానయాన శాఖ ధృవీకరించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంధన ట్యాంకర్లకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో వరుస దాడులు చోటుచేసుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.