LOADING...
Iran: డిమోనా లక్ష్యంగా క్షిపణులు.. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి
డిమోనా లక్ష్యంగా క్షిపణులు.. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

Iran: డిమోనా లక్ష్యంగా క్షిపణులు.. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది. ముఖ్యంగా డిమోనా నగరంలోని కీలక అణు పరిశోధనా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అయితే క్షిపణులు ఆ పరిశోధనా కేంద్రాన్ని నేరుగా తాకకపోయినా సమీప భవనాలపై పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అణు కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కానీ పౌరుల నివాస ప్రాంతాలు లక్ష్యంగా మారడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. శనివారం ఇరాన్‌లోని ప్రముఖ అణుశుద్ధి కేంద్రం నతాంజ్‌పై జరిగిన దాడులకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ దాడులు జరిపినట్లు భావిస్తున్నారు.

వివరాలు

పదిమంది పరిస్థితి విషమం

ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగా వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అరాద్, డిమోనా నగరాల నివాస ప్రాంతాలపై క్షిపణులు పడి భారీ విధ్వంసం సృష్టించాయి. పలు భవనాలు పూర్తిగా కూలిపోయి అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అరాద్‌లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దెబ్బతిన్న భవనాల నుంచి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడుల్లో మరణాలు కూడా జరిగి ఉండవచ్చని ఇజ్రాయెల్ మీడియా పేర్కొన్నప్పటికీ, అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

వివరాలు

40మందికి పైగా గాయాలు

ఇక డిమోనా నగరంలో అణు పరిశోధనా కేంద్రం సమీపంలోని ఒక భవనంపై క్షిపణి పడటంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరాద్ నగరంపైకి వచ్చిన క్షిపణిని అడ్డుకోవడంలో వైఫల్యం చోటుచేసుకోవడంపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెల్లడించాయి. ఈ దాడులను బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరాద్ మేయర్‌తో మాట్లాడినట్లు పేర్కొన్న ఆయన గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ దాడులకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

Advertisement