Page Loader
Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా 
అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా

Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

మంగోలియా ప్రధాని లువ్సన్నమ్స్రైన్ ఓయున్-ఎర్డెన్ (Luvsannamsrain Oyun-Erdene) తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై అవసరమైన మద్దతు పొందడంలో విఫలమయ్యారు. విశ్వాస ఓటింగ్‌ సందర్భంగా ఎర్డెన్‌కు కేవలం 44 మంది ఎంపీలు మాత్రమే మద్దతు ఇచ్చారు. అయితే తీర్మానం ఆమోదం పొందాలంటే 64 మంది మద్దతు అవసరం ఉండగా, ఆయనకు ఇంకా 20 ఓట్లు తక్కువయ్యాయి. ఈ ఓటమి కారణంగా ఎర్డెన్ ప్రధానిగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కొత్త ప్రధానిని ఎంపిక చేయడానికి పార్లమెంట్‌కు 30 రోజుల గడువు ఉండటంతో, అప్పటి వరకు తాత్కాలిక ప్రధానిగా ఎర్డెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వివరాలు 

భారీగా ప్రజా నిరసనలు

ఎర్డెన్‌పై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఆయన కుమారుడి ఖర్చుల చుట్టూ తిరిగినవే. విలాసాల కోసం ఆయన కుమారుడు భారీగా ఖర్చు చేస్తున్నాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటికి తోడు ప్రధాని ఎర్డెన్ స్వయంగా అవినీతిలో ప్రమేయం ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీని ప్రభావంగా రాజధాని ఉలాన్‌బాతర్‌లో గత కొంత కాలంగా భారీగా ప్రజా నిరసనలు చెలరేగాయి. ప్రజలు ఆయన పదవికి రాజీనామా చేయాలని పెద్ద సంఖ్యలో డిమాండ్ చేశారు. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో పార్లమెంటులో రహస్య ఓటింగ్ నిర్వహించగా, అందులో ఎర్డెన్ ఓటమి పాలయ్యారు. తన రాజీనామా నేపథ్యంలో మాట్లాడుతూ ఎర్డెన్, కరోనా మహమ్మారి, యుద్ధాల వంటి కఠిన పరిస్థితుల్లో దేశ ప్రజలకు సేవ చేయడం తనకు గౌరవంగా అనిపించిందని వ్యాఖ్యానించారు.