Loading...
Sudan: సూడాన్‌ మార్కెట్‌పై డ్రోన్ దాడులు..100 మందికి పైగా మృతి
సూడాన్‌ మార్కెట్‌పై డ్రోన్ దాడులు..100 మందికి పైగా మృతి

Sudan: సూడాన్‌ మార్కెట్‌పై డ్రోన్ దాడులు..100 మందికి పైగా మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సూడాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఒకవైపు రాజధాని ఖార్తూమ్ సమీపంలోని కీలక విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరగడంతో నగరంలోని పలు ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి. మరోవైపు, జనంతో రద్దీగా ఉండే మార్కెట్‌పై జరిగిన దాడిలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వరుసఘటనలతో దేశంలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. ఖార్తూమ్ సమీపంలోని ఒమ్‌దుర్మాన్‌లో ఉన్న అల్‌-మర్ఖియత్ ట్రాన్స్‌ఫార్మర్ స్టేషన్‌పై మంగళవారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధానిలోని అనేక ప్రాంతాల్లో 12గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో నీటి సరఫరా వ్యవస్థపైనా ప్రభావం పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రులు,బేకరీలు జనరేటర్ల సాయంతో కార్యకలాపాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

60 శాతం విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఈ దాడి కారణంగా రాజధాని ప్రాంతంలో దాదాపు 60 శాతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు విద్యుత్ శాఖ అధికారి తెలిపారు.

ఈ ఘటన వెనుక రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఇదే విద్యుత్ కేంద్రంపై ఈ ఏడాది జరిగిన రెండో దాడి ఇదేనని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, దక్షిణ డార్ఫర్ రాష్ట్ర రాజధాని న్యాలాలోని ఓ మార్కెట్‌పై సోమవారం సాయంత్రం సూడాన్ సైన్యం డ్రోన్‌తో దాడి చేసినట్లు ఓ సంస్థ వెల్లడించింది.

ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించారని, మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని 'ఎమర్జెన్సీ లాయర్స్' అనే సంస్థ పేర్కొంది.

ఈ దాడిపై స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది.

వివరాలు 

పదివేల మందికి పైగా ప్రాణాలు మృతి 

ప్రస్తుతం న్యాలా నగరం ఆర్‌ఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంది.మార్కెట్‌పై దాడి తర్వాత తమ ఆసుపత్రికి 36మృతదేహాలు వచ్చాయని,మరో 150మందికి చికిత్స అందిస్తున్నామని 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' సంస్థ తెలిపింది.

ఈ వివరాలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.సూడాన్‌లో 2023 ఏప్రిల్ నుంచి దేశ సైన్యానికి,పారామిలటరీ బలగాలైన ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది.

ఈ ఘర్షణల్లో ఇరు పక్షాలు డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తూ దాడులు చేస్తున్నాయి.దీంతో సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు పెరుగుతోంది.

ఇప్పటికే ఈ పోరు కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటి సూడాన్‌లో ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటివరకు ఈ యుద్ధంలో పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా,లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.

ADVERTISEMENT