Mojtaba Khamenei: హర్మూజ్ నిర్వహణలో మార్పులు తప్పవు: మొజ్తాబా ఖమేనీ
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి నిర్వహణపై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ దశలో హర్మూజ్‌పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రకటనను ఆ దేశ మీడియా చదివి వినిపించింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌లో పరిస్థితులు ఇంకా స్థిరపడలేదు. ఈ నేపథ్యంలో జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామని మొజ్తాబా ఖమేనీ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు,ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హక్కులను వదులుకోబోమని తెలిపారు.
వివరాలు
ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం
దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని కూడా పేర్కొన్నారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తమ డిమాండ్ అని వెల్లడించారు. హర్మూజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ దారుణంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. జలసంధి మీదుగా వెళ్లే చమురు నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. అలాంటి చర్యలు చేయకూడదని, ఒకవేళ చేస్తున్నట్లయితే వెంటనే ఆపాలని హెచ్చరించారు. అలాగే, ఇరాన్ సహకరించినా, చేయకపోయినా హర్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరా త్వరలోనే ప్రారంభమవుతుందని మరో ప్రకటనలో తెలిపారు.