Pakistan: మునీర్‌కు సీడీఎఫ్ పదవి.. త్రిదళాలపై పూర్తి నియంత్రణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌ను అనుసరించి త్రివిధ దళాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడానికి పాకిస్థాన్ సిద్ధమైంది. సైన్యం, వైమానిక, నౌకాదళాల మధ్య సమన్వయం బలోపేతం చేసేందుకు ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 'కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్' (CDF) అనే కొత్త హోదాను సృష్టించనుంది. ఈ సీడీఎఫ్ త్రివిధ దళాల సమన్వయ వ్యవస్థకు ప్రధాన అధికారి (హెడ్)గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్థాన్ పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.
Details
సీడీఎఫ్ హోదాకు నియమించేందుకు ప్రణాళిక సిద్ధం
రాజ్యాంగంలోని అధికరణం 243లో మార్పులు చేసేందుకు ఈ సవరణ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్న సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్‌ను నూతనంగా సృష్టించబోయే సీడీఎఫ్ హోదాకు నియమించేందుకు ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది. అలా జరిగితే మునీర్ పాక్ సైన్యంపై మరింత ప్రభావం, నియంత్రణ కలిగించగలరని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటికే ఇలాంటి ఏకీకృత వ్యవస్థ — చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) — అమల్లో ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే నమూనాను అనుసరిస్తున్నట్లుగా భావిస్తున్నారు.