Pm Modi: ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలు,సమగ్ర వాణిజ్య ఒప్పందం: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రెండు దేశాలు పలు కీలక రంగాల్లో పరస్పర ఒప్పందాలకు రావడంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. ఇకపై ఇజ్రాయెల్‌లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. గాజా పరిస్థితులపై స్పందిస్తూ, మానవత్వం ఎప్పుడూ యుద్ధాల బలిగా మారకూడదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శాంతి ప్రణాళిక ద్వారా ఓ ముందడుగు పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందన్నారు.
వివరాలు
ఇరుదేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), వ్యవసాయం, యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మొత్తం 27 రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు రెండు దేశాలు అంగీకారం వ్యక్తం చేశాయి. త్వరలోనే వాణిజ్య ఒప్పందాన్ని తుదిరూపు దిద్దాలని సంయుక్త ప్రకటనలో ఇరుదేశాల నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును భారత్‌కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ, తమ పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అందరినీ ప్రభావితం చేసిందని, భారత్‌తో ఉన్న స్నేహానికి తమ దేశం కృతజ్ఞతాభివందనలు తెలుపుతుందని పేర్కొన్నారు.