Elon Musk: 'నా భాగస్వామి హాఫ్-ఇండియన్, కొడుకు పేరు శేఖర్': ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు,టెస్లా సంస్థ అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలను బహిరంగంగా వెల్లడించారు. తన జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని, తమకు జన్మించిన కుమారుల్లో ఒకరికి "శేఖర్" అనే పదం ఉండేలా పేరు పెట్టామని తెలిపారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వివరాలు
ఆమె పూర్వీకులు భారతీయులే..
"నాకూ, శివోన్ జిలిస్‌కు జన్మించిన కుమారుల్లో ఒకరి పేరులో 'శేఖర్' అనే పదం ఉండేలా పెట్టాం. ఇది భారతీయ మూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి తీసుకున్నది. నా సహచరిణి శివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబ్‌కు చెందినది. చిన్నతనంలో ఉండగానే శివోన్‌ను మరో కుటుంబం దత్తత తీసుకుంది. అందువల్ల ఆమె కెనడాలో పెరిగింది" అని మస్క్ వివరించారు. శివోన్ ఎక్కడ పెరిగిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ..ఆమె పూర్వీకులు భారతీయులేనని చెప్పారు. శిశువుగా ఉన్నప్పుడే ఆమెను దత్తత ఇచ్చారని, పూర్తి వివరాలు తనకు తెలియకపోయినా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారని తెలిపారు. అనంతరం కెనడాలో పెరిగిన ఆమె, అలా ఇండియన్-అమెరికన్ నేపథ్యం కలిగిన వ్యక్తిగా మారిందన్నారు.
వివరాలు
శివోన్ ఎవరంటే..
శివోన్ జిలిస్ విషయానికి వస్తే.. ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రొఫెషనల్. 2017లో మస్క్‌కు చెందిన ఏఐ సంస్థ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుకాలంలో ఐస్ హాకీ జట్టు సభ్యురాలిగానూ కొనసాగారు. అనంతరం ఐబీఎం, బ్లూమ్‌బర్గ్ వంటి సంస్థల్లో పని చేసి, 2016లో ఓపెన్‌ఏఐలో చేరారు. జిలిస్-మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. 2021లో కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. 2024 ఫిబ్రవరిలో కుమార్తె ఆర్కాడియా పుట్టగా, ఆ తర్వాత మరో కుమారుడు సెల్డన్ లైకుర్గస్ జన్మించాడు.
వివరాలు
భారతీయులతో అమెరికా లబ్ధి పొందింది..
ఈ పిల్లలలో ఒకరి పేరులో 'శేఖర్' అనే పదాన్ని చేర్చారు.అంతేకాక.. మస్క్‌కు ఇతర భాగస్వాములతో కూడా సంతానం ఉన్న సంగతి తెలిసిందే. పోడ్‌కాస్ట్‌లో భాగంగా మస్క్ అమెరికాలో వలసలు,ప్రతిభావంతుల నియామకాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ ప్రతిభను ఎక్కువగా ఆహ్వానించుకోవడం ద్వారా అమెరికా గణనీయంగా లాభపడిందని చెప్పారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ గతంలో దుర్వినియోగం కావడం,అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అమెరికాలో వలసలకు వ్యతిరేక భావన పెరగడానికి కారణమని అభిప్రాయపడ్డారు. జో బైడెన్ పరిపాలనలో సరిహద్దులపై సరైన నియంత్రణ లేకపోవడంతో ప్రజలు స్వేచ్ఛగా అమెరికాకు వచ్చేవారని విమర్శించారు. సరిహద్దులపై సరైన అంక్షలు లేకపోతే దేశానికే అర్థం ఉండదని వ్యాఖ్యానించారు.బైడెన్ ప్రభుత్వ హయాంలో అక్రమ వలసదారుల ప్రవేశం అధికంగా జరిగిందన్నారు.
వివరాలు
"నెగటివ్ సెలక్షన్ ఎఫెక్ట్"
ఇది కొంతవరకు "నెగటివ్ సెలక్షన్ ఎఫెక్ట్" అని పేర్కొన్న మస్క్, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు అమెరికన్ల ఉద్యోగాలను దోచుకుంటున్నారనే భావనలో వాస్తవమెంతో కచ్చితంగా చెప్పలేనన్నారు. అయితే ప్రతిభావంతుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని తన అనుభవంతో చెప్పారు. అత్యంత క్లిష్టమైన పనులు నిర్వహించేందుకు ప్రతిభావంతుల నియామకం అవసరమని తెలిపారు. స్పేస్‌ఎక్స్, టెస్లా, ఎక్స్ వంటి అగ్రశ్రేణి అమెరికన్ కంపెనీల అధినేతగా తాను ఎప్పుడూ ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తానని, సగటు కంటే ఎక్కువ వేతనాలు చెల్లించి ఉత్తములను తీసుకుంటానని స్పష్టం చేశారు.
వివరాలు
మీరు తీసుకునేదానికంటే ఎక్కువ పనిచేసే వారిని నేను గౌరవిస్తాను
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అయితే దుర్వినియోగాన్ని కట్టడి చేయాలని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించే భారతీయ యువతకు సందేశమిస్తూ, "మీరు తీసుకునేదానికంటే ఎక్కువ పనిచేసే వారిని నేను గౌరవిస్తాను. సమాజానికి అందించే విలువ తీసుకునేదానికన్నా ఎక్కువగా ఉండాలి. ఇన్‌పుట్ కంటే ఔట్‌పుట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి" అని మస్క్ పేర్కొన్నారు.