Loading...
Katie Zacharia : ట్రంప్‌ను భర్తగా పేర్కొన్న కొత్త ప్రెస్ సెక్రటరీ.. వైట్‌హౌస్‌లో నవ్వులు.. 14 నిమిషాల్లోనే ముగిసిన సమావేశం
14 నిమిషాల్లోనే ముగిసిన సమావేశం

Katie Zacharia : ట్రంప్‌ను భర్తగా పేర్కొన్న కొత్త ప్రెస్ సెక్రటరీ.. వైట్‌హౌస్‌లో నవ్వులు.. 14 నిమిషాల్లోనే ముగిసిన సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా తొలి మీడియా సమావేశం అనూహ్య పరిణామాలతో ముగిసింది. బాధ్యతలు చేపట్టిన రెండో రోజే వైట్‌హౌస్‌లో విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. కేవలం 14 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదవడం,విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబడటం,చివర్లో ట్రంప్‌ను తన భర్తగా పేర్కొనడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆమె పనితీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ తనను ప్రెస్ సెక్రటరీగా నియమించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కేటీ జకారియా తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. అనంతరం సుమారు ఆరు నిమిషాల పాటు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదివారు.

వివరాలు 

తెలుసుకుని సమాధానం చెబుతానన్న కేటీ

ఈ సందర్భంగా ట్రంప్‌ను ప్రశంసించడంతోపాటు, ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలుగా తాను భావిస్తున్న అంశాలను వివరించారు.

వెనెజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక చర్యను కేటీ జకారియా 'చారిత్రాత్మకమైన ఒకరోజు యుద్ధం'గా అభివర్ణించారు.

అదే సమయంలో ఇరాన్‌తో ఘర్షణ తొమ్మిదో నెలకు చేరువవుతోందని పేర్కొన్నారు.

అనంతరం ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ ఆమెను ప్రశ్నించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ట్రంప్‌కు తాజాగా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. అమెరికా ఉక్రెయిన్‌తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం నిలిపివేసిందా అని అడిగారు.

అయితే, ఈ ప్రశ్నకు కేటీ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయారు.

ఈ విషయంపై వివరాలు తెలుసుకుని తిరిగి సమాధానం చెబుతానని పీటర్ డూసీకి తెలిపారు.

వివరాలు 

గ్రీస్‌లో అమెరికా రాయబారిపై కీలక ప్రకటన

కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రెస్ సెక్రటరీ తొలి సమావేశంలోనే ఇలాంటి కీలక ప్రశ్నకు తక్షణ సమాధానం ఇవ్వలేకపోవడం చర్చకు దారితీసింది.

డైలీ మెయిల్ ప్రతినిధి గ్రీస్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కింబర్లీ గిల్‌ఫాయిల్ గురించి ప్రశ్నించారు.

ఏథెన్స్‌లో ఆమె వ్యవహారశైలికి సంబంధించి వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆమెను రాయబారి పదవి నుంచి తొలగించే అంశాన్ని ట్రంప్ ఇంకా పరిశీలిస్తున్నారా అని అడిగారు.

దీనిపై కేటీ స్పందిస్తూ..గిల్‌ఫాయిల్‌ను పదవికి రాజీనామా చేయాలని ట్రంప్ కోరినట్లు వెల్లడించారు.

గిల్‌ఫాయిల్ గతంలో ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాతగా పనిచేశారు.ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో ఆమెకు గతంలో నిశ్చితార్థం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆమె పదవికి సంబంధించిన ప్రశ్నకు కేటీ ఇచ్చిన సమాధానం సమావేశంలో కీలకంగా నిలిచింది.

ADVERTISEMENT

వివరాలు 

నలుగురు పిల్లలతో బాధ్యతలను ఎలా నిర్వహిస్తారంటే..

కేటీ జకారియా కుటుంబ జీవితం గురించి కూడా డైలీ మెయిల్ విలేకరి ప్రశ్నించారు.

నలుగురు పిల్లలను పెంచుకుంటూనే, ఒత్తిడితో కూడుకున్న ప్రెస్ సెక్రటరీ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని అడిగారు.

గతంలో ఈ పదవిలో పనిచేసిన కరోలిన్ లీవిట్ ఇద్దరు పిల్లల సంరక్షణతో ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో ఎదురైన సవాళ్ల కారణంగా రాజీనామా చేసినట్లు వచ్చిన కథనాలను కూడా ప్రస్తావించారు.

ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కేటీ తడబడ్డారు. కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతున్న సమయంలో ట్రంప్‌ను తన భర్తగా పేర్కొనడంతో అక్కడ నవ్వులు వినిపించాయి.

ADVERTISEMENT

వివరాలు 

'నా అధ్యక్షుడు.. క్షమించండి, నా భర్త' అంటూ..

కుటుంబం గురించి వివరిస్తున్న క్రమంలో కేటీ జకారియా అనుకోకుండా ట్రంప్‌ను తన భర్తగా సంబోధించారు.

'నా అధ్యక్షుడు.. క్షమించండి, నా భర్త ఇక్కడ ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.

వెంటనే తన పొరపాటును గుర్తించినప్పటికీ, అప్పటికే మీడియా సమావేశంలో నవ్వులు వినిపించాయి.

ఆ తర్వాత కేటీ తేరుకుని ట్రంప్‌ను ప్రశంసించడం కొనసాగించారు. కుటుంబాలకు అనుకూలంగా వ్యవహరించే అధ్యక్షుడు ట్రంప్ అని పేర్కొన్నారు.

కుటుంబాలు ఉన్న మహిళలకు ఆయన ఎక్కువ అవకాశాలు కల్పించారని చెప్పారు.

తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, ప్రెస్ సెక్రటరీ ఉద్యోగం ఎంత కష్టమైనదో తెలిసినా ట్రంప్ తనపై నమ్మకం ఉంచారని వివరించారు.

ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలననే విశ్వాసం తనకు ఉందని తెలిపారు.

వివరాలు 

కేటీకి వైట్‌హౌస్ మద్దతు

తొలి మీడియా సమావేశంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో కేటీ జకారియా పనితీరుపై విమర్శలు వచ్చాయి.

అయితే,వైట్‌హౌస్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది.వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీఫెన్ చ్యూంగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు.

కేటీ తొలి మీడియా సమావేశం అద్భుతమైన ప్రారంభమని ప్రశంసించారు.

ఆమె సమావేశాన్ని సమర్థంగా నిర్వహించారని, ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన మంచి పనులను అమెరికా ప్రజలకు గుర్తుచేశారని పేర్కొన్నారు.

కాగా,ట్రంప్ గత శుక్రవారం కేటీ జకారియాను కొత్త ప్రెస్ సెక్రటరీగా నియమించారు.

గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన కరోలిన్ లీవిట్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.

అయితే, తొలి సమావేశంలోనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబడటం,ట్రంప్‌ను తన భర్తగా పొరబడటం వంటి పరిణామాలు ఆమె పనితీరుపై చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT